Share News

రాష్ట్రంలో ‘డిటెన్షన్‌’ ఇప్పుడే కాదు!

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:16 AM

పాఠశాల విద్యలో ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఇప్పుడే అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు పరచకూడదని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

రాష్ట్రంలో ‘డిటెన్షన్‌’ ఇప్పుడే కాదు!

  • అమలు చేస్తే డ్రాపౌట్లు పెరుగుతాయి

  • పాఠశాల విద్యపై ప్రభుత్వ ఆలోచన

  • అమలు చేస్తే డ్రాపౌట్లు పెరుగుతాయనే ఆందోళన

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యలో ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఇప్పుడే అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు పరచకూడదని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే విద్యార్థులు నష్టపోతారని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై విస్తృతంగా చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు పాత విధానాన్నే అమలు చేయాలని భావిస్తున్నారు. 5, 8వ తరగతుల్లో నో డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అంటే ఈ రెండు తరగతుల్లో వార్షిక పరీక్షల్లో పాసైన విద్యార్థులనే పై తరగతులకు పంపిస్తారు. ఒకవేళ ఫెయిల్‌ అయితే రెండు నెలల్లో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.


ఆ పరీక్షల్లోనూ ఫెయిలైతే మళ్లీ 5, లేదా 8వ తరగతులే చదవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్కూళ్లకు వర్తించనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పట్లో ఈ విధానాన్ని అమలు చేసే ఆలోచన చేయడం లేదు. కేంద్రం తీసుకున్న విఽధానాన్ని రాష్ట్రంలో అమలు పరిస్తే.. పాఠశాల విద్యలో డ్రాపౌట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పడిపోవడంతో పాటు పేద వర్గాలకు విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో డిటెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే పేదలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి అభిప్రాయపడ్డారు. కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో డ్రాపౌట్స్‌ పెరుగుతారని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Dec 24 , 2024 | 04:16 AM