Share News

Healthcare Facilities: రక్తశుద్ధిపై చిత్తశుద్ధి

ABN , Publish Date - Aug 20 , 2024 | 04:21 AM

మూత్రపిండాల వైఫల్య బాధితులకు ఊరట కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Healthcare Facilities: రక్తశుద్ధిపై చిత్తశుద్ధి

  • రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ వాస్క్యులర్‌ కేంద్రాల ఏర్పాటు

  • ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, పాలమూరుకు అవకాశం

  • రూ.32.7 కోట్లతో త్వరలో రోగులకు అందుబాటులోకి

  • 16 ప్రాంతాల్లో కొత్తగా డయాలసిస్‌ కేంద్రాలు

  • 17 ఆస్పత్రులకు 74 అదనపు రక్తశుద్ధి యంత్రాల సరఫరా

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మూత్రపిండాల వైఫల్య బాధితులకు ఊరట కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రం నలువైపులా నాలుగు ప్రాంతీయ వాస్క్యులర్‌ యాక్సెస్‌ కేంద్రాలు, కొత్తగా 16 చోట్ల డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు.. 17 ఆస్పత్రుల్లో అదనంగా 74 రక్తశుద్ధి యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కిడ్నీ ఫెయిల్యూర్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డయాలసిస్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 85 కేంద్రాలున్నప్పటికీ అవి సరిపోని పరిస్థితి.


దీంతో కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ డయాలసిస్‌ సెషన్స్‌ నడుస్తున్నాయి. కొన్ని రక్తశుద్ధి కేంద్రాలపై రోగుల భారం ఎక్కువగా ఉంటోంది. బాఽధితులు కొన్నిసార్లు డయాలసిస్‌ కోసం 30 కిలోమీటర్ల దూరానికి మించి ప్రయాణం చేయాల్సిన సందర్భాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు వైౖద్య శాఖ సమాయత్తమైంది. వీటివల్ల బాధితులు ఎక్కువ దూరాలు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే 4-5 షిఫ్టుల్లో డయాలసిస్‌ సేవలందిస్తున్న కేంద్రాలపై భారం కూడా తగ్గుతుంది. కొత్త కేంద్రాల ఏర్పాటుతో డయాలసిస్‌ రోగులు వేచిచూడాల్సిన సమయం బాగా తగ్గుతుందని ఉన్నతాఽధికారులు చెబుతున్నారు.


  • నాలుగు ప్రాంతీయ వ్యాస్కులర్‌ యాక్సెస్‌ కేంద్రాలు...

రెండు మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు తప్పనిసరిగా రక్తశుద్ధి చేయాలి. వారి పరిస్థితిని బట్టి వారానికి రెండు నుంచి మూడు సార్లు డయాలసిస్‌ అవసరం అవుతుంది. తొలిసారి డయాలసిస్‌ చేయాల్సివచ్చినప్పుడు రోగికి మొదట ఒక శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. డయాలసి్‌సకు యాక్సెస్‌ పాయింట్‌ను రూపొందించే సర్జరీ ఇది. సాధారణంగా చేతి మణికట్టు దగ్గర చేస్తారు. రక్తప్రసరణ వ్యవస్థకు చికిత్స చేయడంలో నైపుణ్యం కలిగిన వ్యాస్కులర్‌ సర్జన్‌ ఈ సర్జరీ చేస్తారు. ఒక్కసారి మణికట్టు వద్ద ఈ యాక్సెస్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయించుకుంటే.. ఆ తర్వాత డయాలసిస్‌ చేయడం చాలా సులభతరం అవుతుంది.


ప్రస్తుతం ఈ వాస్క్యులర్‌ సర్జరీ చేయించుకోవడానికి కిడ్నీ పేషెంట్లు కచ్చితంగా హైదరాబాద్‌ రావాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా.. రాష్ట్రానికి నలుదిక్కులా ఈ వాస్క్యులర్‌ యాక్సెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ పట్టణాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అలాగే హైదరాబాద్‌లో డయాలసిస్‌ కోసం ఏర్పాటు చేసిన మూడు హబ్‌ ఆస్పత్రులైన నిమ్స్‌, గాంధీ, ఉస్మానియాలలో వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇందుకోసం ఒక్క నిమ్స్‌ కేంద్రానికే అత్యధికంగా రూ.9.82 కోట్లు, గాంధీకి రూ.9.43 కోట్లు, ఉస్మానియాకు రూ.9.41 కోట్లు కేటాయించారు. ఏడు కేంద్రాలకూ కలిపి రూ.32.70 కోట్లు ఖర్చు అవుతుందని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎ్‌సఐడీసీ) అంచనాలు వేసింది. అందుకు సంబంధించిన నివేదికను ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈవోకు పంపింది.


  • అదనపు డయాలసిస్‌ మిషన్లు..

ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో రోగులకు తాకిడి ఎక్కువగా ఉండటంతో వాటిలో అదనపు యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలా ఏర్పాటు చేస్తున్న వాటిలో ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పత్రి పరిఽధిలో పాల్వంచ, చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఐదు, కోరుట్ల ప్రాంతీయ ఆస్పత్రిలో ఐదు, గద్వాల జిల్లా ఆస్పత్రిలో 2, హుజురాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో 5, సత్తుపల్లి ప్రాంతీయ ఆస్పత్రిలో 5, మహబూబాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల్లో ఒక్కొచోట ఐదేసి చొప్పున, మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌లో 4, నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో 2, జహీరాబాద్‌ ప్రాంతీయ ఆస్పత్రిలో 5, సిద్దిపేట జీజీహెచ్‌లో 10, హుజుర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రిలో 5, భువనగిరి జిల్లా ఆస్పత్రిలో 3, వరంగల్‌ జిల్లా నర్సంపేట జిల్లా ఆస్పత్రిలో 2 అదనపు డయాలసిస్‌ మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు.


  • కొత్త డయాలసిస్‌ కేంద్రాలు..

ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ సీహెచ్‌సీ, హైదరాబాద్‌లో యూసీహెచ్‌సీ అంబర్‌పేట, సీహెచ్‌సీ బార్కాస్‌, ఖమ్మం జిల్లా మధిర ప్రాంతీయ ఆస్పత్రి, మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ సీహెచ్‌సీ, మెదక్‌ జిల్లాలో తూప్రాన్‌ సీహెచ్‌సీ, నర్సాపూర్‌ ప్రాంతీయ ఆస్పత్రి, మేడ్చల్‌ జిల్లాలో మల్కాజ్‌గిరి, మేడ్చల్‌ సీహెచ్‌సీలు, నల్గొండ జిల్లా మర్రిగూడ సీహెచ్‌సీ, రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్‌, ఉప్పల్‌ సీహెచ్‌సీ, కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రి, సంగారెడ్డి జిల్లాలో పఠాన్‌చెరు ప్రాంతీయ ఆస్పత్రి, సదాశివపేట సీహెచ్‌సీ, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సీహెచ్‌సీలో కొత్తగా డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐదు నుంచి 10 పడలకతో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.


19.jpg

  • కిడ్నీ పేషెంట్లకు ఊరట

రాష్ట్రంలో డయాలసిస్‌ కేంద్రాలు, మిషన్ల సంఖ్యను పెంచుతున్నాం. మొత్తం కేంద్రాల సంఖ్య 102, మిషన్ల సంఖ్య 730కు చేరబోతున్నాయి. దీంతో డయాలసిస్‌ కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. సహయకుల అవసరం లేకుండానే కేంద్రాలకు వెళ్లి రక్తశుద్ధి చేయించుకోవచ్చు. డయాలసిస్‌ కోసం వేచిచూసే సమయం కూడా బాగా తగ్గుతుంది. దీంతో వారికి భారీ ఉపశమనం కలుగుతుంది.

- మంత్రి దామోదర

Updated Date - Aug 20 , 2024 | 04:21 AM