Share News

CM Revanth Reddy: క్రీడల వర్సిటీ!

ABN , Publish Date - Aug 18 , 2024 | 02:50 AM

రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాలు పెంచి.. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సాధన కోసం ఇటీవలే యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. క్రీడలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది.

CM Revanth Reddy: క్రీడల వర్సిటీ!

  • యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ పేరిట ఏర్పాటు

  • హకీంపేట లేదా గచ్చిబౌలిలో స్థల పరిశీలన

  • ఫ్యూచర్‌ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో

  • 12 అకాడమీలు.. సైన్స్‌, మెడిసిన్‌ సెంటర్లు

  • వెల్లడించిన సీఎం.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌కు జవాబు

  • త్వరలో దక్షిణ కొరియా స్పోర్ట్స్‌ వర్సిటీతో ఒప్పందం

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాలు పెంచి.. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సాధన కోసం ఇటీవలే యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. క్రీడలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్కిల్స్‌ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీనికి కూడా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీగా నామకరణం చేసింది. గచ్చిబౌలి స్పోర్ట్స్‌ అకాడమీ లేదా హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో దీనిని ఏర్పాటుచేసే అవకాశం ఉంది. కాగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీ (ఫోర్త్‌సిటీ)లోని స్పోర్ట్స్‌ హబ్‌లో దాదాపు 12 క్రీడల అకాడమీలను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది.


వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్‌ హబ్‌లో స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ సెంటర్‌ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్‌ ప్రకటించారు. ఇటీవల ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఒక్క బంగారు పతకం కూడా సాధించని విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా శనివారం ట్వీట్‌ చేశారు. ఒక రజతం, ఐదు కాంస్యాలు.. 6 పతకాలతో భారత్‌ 71వ స్థానంలో నిలవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు.


‘డియర్‌ ఆనంద్‌ మహీంద్రా జీ.. ఈ విషయం నేను మీకు ప్రైవేటుగా చెబుదామనుకున్నా.. ఇప్పుడు బహిరంగంగా వెల్లడిస్తున్నా’ అంటూ జవాబిచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న స్పోర్ట్స్‌ యునివర్సిటీకి సంబంధించిన పూర్తి వివరాలను ఆయనకు ఎక్స్‌లో వివరించారు. ఆ తర్వాత అవే వివరాలతో సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వర్సిటీ ఏర్పాటుకు అనువైన స్థలంగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్‌ స్కూల్‌ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నారు. సదరు క్యాంప్‌సను ఒలింపిక్స్‌ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలుండేలా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. హకీంపేటలోని 200 ఎకరాలు దీని ఏర్పాటుకు అనువుగా ఉందని గుర్తించినట్లు సమాచారం.


  • దక్షిణ కొరియాలోనే ఆలోచన

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్‌లోని కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్‌ యూనివర్సిటీగా ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా మొత్తం 32 పతకాలు గెలుచుకోగా, వాటిలో 16 పతకాలు కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే! ఇక్కడ శిక్షణ పొంది, పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించిన అథ్లెట్‌ లిమ్‌ సి-హైయోన్‌ను సీఎం రేవంత్‌ తన పర్యటనలో కలిసి అభినందించారు.


భవిష్యత్తు ఒలింపిక్‌ చాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా తెలంగాణ యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ సేవలు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో మోదీ సర్కారు 2018లో నేషనల్‌ స్పోర్ట్స్‌ యునివర్సిటీని ఏర్పాటు చేసింది. దేశంలో ఏకైక జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఇదే. రాష్ట్రాల్లో మాత్రం మొట్టమొదటిసారి తమిళనాడు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ యునివర్సిటీని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 2004లో ప్రారంభించింది. తర్వాత మహారాజా భూపేందర్‌ సింగ్‌ స్పోర్ట్స్‌ యునివర్సిటీని పంజాబ్‌ ప్రభుత్వం పటియాలాలో 2019లో ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, అసోంల్లోనూ స్పోర్ట్స్‌ వర్సిటీలను ఏర్పాటు చేశారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో క్రీడల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం స్థాపించిన రాష్ట్రంగా తెలంగాణ పేరు గడించనుంది.

Updated Date - Aug 18 , 2024 | 02:50 AM