Share News

Road Safety: పాఠశాలల్లో ట్రాఫిక్‌ అవగాహన పార్క్‌లు

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:07 AM

అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు.

Road Safety: పాఠశాలల్లో ట్రాఫిక్‌ అవగాహన పార్క్‌లు

  • బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నియంత్రణ చర్యలు

  • సుప్రీం కమిటీ నిర్దేశాల మేరకు రహదారులపై జాగ్రత్తలు

  • రోడ్డు భద్రతపై సచివాలయంలో మంత్రి పొన్నం సమీక్ష

హైదరాబాద్‌, సిటీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం రోడ్డు భద్రతపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇంటర్మీడియట్‌ దశలోనే విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలు తెలియాలని.. పాఠశాలల్లో ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ పార్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిరుడు రాష్ట్రంలో 22,903 ప్రమాదాల్లో 7,186 మంది చనిపోగా, 2,476 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిని తీవ్రంగా పరిగణించిన రవాణా శాఖ ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించింది.


రోడ్డు భద్రతకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రమాదాలకు కారణాలు, జాగ్రత్తలను సచివాలయంలో సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. వాటిప్రకారం.. సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల ప్రకారం సంబంధిత విభాగాలు మోటార్‌ వెహికిల్‌ చట్టం అమలు చేయాలి. తీవ్ర ప్రమాదాలకు కారణమైన, మద్యం తాగి, రాంగ్‌ రూట్‌లో నడిపినవారి లైసెన్స్‌లు రద్దు చేయాలి. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల (బ్లాక్‌ స్పాట్స్‌)ను గుర్తించి చర్యలు తీసుకోవాలి. జిల్లాల వారీగా ఉన్న రోడ్‌ భద్రతా కమిటీలు క్రమంతప్పకుండా సమావేశాలు నిర్వహించాలి.


రవాణా, పోలీస్‌, ట్రాఫిక్‌, ఆర్‌అండ్‌బీ, 108, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు.. మరణాలు చోటుచేసుకున్న ప్రతి రోడ్డు ప్రమాదాన్ని సమీక్షించాలి. కారణాలను గుర్తించి.. ఇకపైన ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. జాతీయ రహదారులపై పాదచారుల వంతెనలు నిర్మించాలి. డ్రైవింగ్‌ లైసెన్సుల తనిఖీలు, డ్రంకెన్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ల విషయంలో చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్ర, జిల్లాల స్థాయిలో ప్రతి నెల రోడ్డు భద్రతా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి. వీటిలో అన్ని విభాగాల అధికారులు పాల్గొనేలా చూడాలి.


ట్రాన్స్‌పోర్ట్‌, పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు ప్రతి నెల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలి. ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలపై ఈ సమావేశాల్లో సమీక్షించాలి. తరచూ ప్రమాదాలు జరిగే మార్గాల్లో అంబులెన్సులు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో సమావేశంలో చర్చించారు. దగ్గర్లో అత్యవసర చికిత్స సౌకర్యాలు ఏమున్నాయో ఆరా తీశారు. అంబులెన్సులు, సమీపంలో ఉన్న ఆసుపత్రులకు మధ్య మంచి సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

Updated Date - Aug 24 , 2024 | 03:07 AM