Share News

Ghatkesar: లే ఔట్‌ స్థలానికి పాస్‌ బుక్‌లు..

ABN , Publish Date - May 30 , 2024 | 04:31 AM

ఆ స్థలం ఎప్పుడో 45 ఏళ్ల క్రితమే వెంచర్‌గా మారిపోయింది. వందల మంది అక్కడ పైసలు పోసి ప్లాట్లు కొనుకున్నారు. ఒకప్పుడు ఊరికి దూరంగా ఉన్న ఆ స్థలాలు.. ఇప్పుడు రూ.కోట్లు పలుకుతున్నాయి. అయితే, అధికారులు చేసిన తప్పిదం వల్ల ఆ లేఔట్‌కు మళ్లీ పట్టా పుస్తకాలు జారీ అయ్యాయి. వాటి ఆధారంగా తెరపైకి వచ్చిన కొందరు.. ఆ లేఔట్‌లోని రూ.50 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కబ్జా చేశారు.

Ghatkesar: లే ఔట్‌ స్థలానికి పాస్‌ బుక్‌లు..

  • 1979లో వెంచర్‌.. 2018లో మళ్లీ పట్టా జారీ

  • భూ రికార్డుల ప్రక్షాళనలో అధికారుల తప్పిదం

  • ఆ పట్టా పుస్తకాలతో ప్రత్యక్షమైన యజమానులు

  • లే ఔట్‌లో ఎకరన్నరకుపైగా స్థలం కబ్జా.. విక్రయం

  • 50 కోట్ల విలువైన పార్కు స్థలం కాజేసే యత్నం

ఘట్‌కేసర్‌, మే 29 : ఆ స్థలం ఎప్పుడో 45 ఏళ్ల క్రితమే వెంచర్‌గా మారిపోయింది. వందల మంది అక్కడ పైసలు పోసి ప్లాట్లు కొనుకున్నారు. ఒకప్పుడు ఊరికి దూరంగా ఉన్న ఆ స్థలాలు.. ఇప్పుడు రూ.కోట్లు పలుకుతున్నాయి. అయితే, అధికారులు చేసిన తప్పిదం వల్ల ఆ లేఔట్‌కు మళ్లీ పట్టా పుస్తకాలు జారీ అయ్యాయి. వాటి ఆధారంగా తెరపైకి వచ్చిన కొందరు.. ఆ లేఔట్‌లోని రూ.50 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కబ్జా చేశారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మునిసిపాలిటీ యంనంపేట్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 137, 138లో శ్రీ వేంకటేశ్వర హౌసింగ్‌ కాలనీ పేరుతో 1979లో లేఔట్‌ చేశారు. 29.34 ఎకరాల్లో 417 ప్లాట్లు చేశారు. ఈ వెంచర్‌లో ఒక చోట 8 వేల చదరపు గజాలను కాలనీ ప్రజల ఉమ్మడి అవసరాల నిమిత్తం ఖాళీగా వదిలారు. 2018లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఈ స్థలానికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పుస్తకాలు జారీ చేశారు.


దీంతో గతంలోనే విక్రయించిన స్థలాలకు మళ్లీ యజమానులు పుట్టుకొచ్చారు. కొత్త పట్టా పుస్తకాలతో లేఔట్‌లోని 8 వేల గజాల(ఎకరన్నర పైగా) స్థలాన్ని ఆక్రమించారు. 2020 వరకు ఈ స్థలం ఖాళీగా ఉండటంతో మునిసిపల్‌ అధికారులు ఇక్కడ చెత్తను నిల్వ చేశారు. ఇందు కోసం ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. పట్టాదారు పుస్తకాలు పొందిన యజమాని 2020లో ఈ స్థలాన్ని ఇతరులకు విక్రయించారు. కొనుగోలు చేసిన నూతన యజమాని తమ స్థలంలో చెత్తను తొలగించాలని మునిసిపల్‌ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. లేఔట్‌లో పార్కు కోసం ఉద్దేశించిన ఆ స్థలం మునిసిపల్‌కే చెందుతుందని కమిషనర్‌ వివరణ ఇచ్చారు. దీంతో ఆ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. చెత్తను తొలగించాలని మునిసిపల్‌ అధికారులకు సూచించింది. ఇదే అదనుగా భావించిన భూ యజమానులు.. మునిసిపల్‌ అధికారులు వేసిన ఫెన్సింగ్‌ను పూర్తిగా తొలగించారు. ఆనంతరం ఆ స్థలం తమదేనని బోర్డు పెట్టారు.


సర్కారు స్పందించకపోవడంపై అనుమానాలు

మునిసిపాలిటీకి చెందిన పార్కు స్థలానికి జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్‌, కీసర ఆర్డీవో, ఘట్‌కేసర్‌ తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్లకు 2020లోనే మునిసిపల్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఎవరూ చర్యలు తీసుకోలేదు. కంచె ధ్వంసం చేసిన విషయమై మునిసిపల్‌ అధికారులు తాజాగా ఈ నెల 24న ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివాదాస్పదంగా మారిన ఈ స్థలం ఐటీ హబ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడ గజానికి దాదాపు రూ.50 వేల నుండి రూ.60వేల వరకు ఉంది. ఈ స్థలం విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటుంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 30 , 2024 | 04:31 AM