Share News

Warangal: వరికొయ్యల మరణ శాసనం..

ABN , Publish Date - May 20 , 2024 | 04:25 AM

ఈ నెల 9న వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు (65) తన చేలో మొక్కజొన్న కొయ్యల దహనానికి అగ్గిపుల్ల గీయగా మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రతతో మరింత పెట్రేగాయి. వాటి ధాటికి పాపారావు సజీవ దహనమయ్యాడు.

Warangal: వరికొయ్యల మరణ శాసనం..

  • కొయ్యల దహనం అన్నదాతల ప్రాణాల మీదకు.. వరంగల్‌, నిజామాబాద్‌లో ఇద్దరు రైతుల మృతి

  • పంజాబ్‌, హరియాణాలో వాతావరణ కాలుష్యం

  • మన రాష్ట్రానికీ పాకిన పంట వ్యర్థాల దహనం

  • ఈ పద్ధతిలో సూక్ష్మజీవులు మృతితో భూమికి చేటు

ఈ నెల 9న వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు (65) తన చేలో మొక్కజొన్న కొయ్యల దహనానికి అగ్గిపుల్ల గీయగా మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రతతో మరింత పెట్రేగాయి. వాటి ధాటికి పాపారావు సజీవ దహనమయ్యాడు.

ఈ నెల మూడో తేదీన నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం పెద్ద వాల్గోట్‌లో కిషన్‌ వరి కొయ్యలకు నిప్పంటించాడు. 45 డిగ్రీలకు పైగా ఎండ, కొయ్యలు ఎండి ఉండడంతో మంటలు ఎగశాయి. కిషన్‌ వాటిని తప్పించుకోలేక సజీవ దహనమయ్యారు.


ఎండిన కొయ్యలు దహనం చేయబోయి ఈ నెలలోనే ఇద్దరు రైతులు అగ్నికి ఆహుతయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన జారీ చేశారు. అధికారులు గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. అయినా చాలామంది రైతులు ఆగడం లేదు. రాష్ట్రంలో కొన్నేళ్ల కిందటి వరకు వరి కోతలను మనుషులే కోసేవారు. ఇప్పుడు హార్వెస్టర్లను వాడుతున్నారు. కొద్ది రోజులకు కొయ్య కాళ్లను దహనం చేస్తున్నారు. కాగా, పంట వ్యర్థాల దహనం విధానం.. సాగులో యంత్రాలను బాగా వినియోగించే పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉంటుంది. అక్కడ కొయ్యలు అడుగు నుంచి రెండు అడుగుల ఎత్తులో మిగులుతాయి. వీటిని తొలగించడంలో కూలీ ఖర్చులకు తోడు సమయం పడుతుంది. దీంతోనే నిప్పు పెడుతుంటారు. ఈ మంటల పొగ ఢిల్లీకి కూడా వ్యాపించి కాలుష్య సమస్య సృష్టిస్తోంది. కొయ్యలకు నిప్పంటించే క్రమంలో రైతులు చనిపోవడంతో పాటు పక్క చేలు కూడా కాలిపోతున్నాయి. పొగతో వాతావరణం కలుషితం అవుతోంది. మంటల తీవ్రతకు నేల గట్టిపడి దెబ్బతింటోంది. కాగా, గడ్డి, భూమిలో చాలా పోషకాలు ఉంటాయని, కొయ్యల దహనంతో అవన్నీ కోల్పోతామని వ్యవసాయ నిపుణులు జీవీ రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఖర్చు లేకుండా మరో పంటకు వెళ్లాలనే

పొలంలో హార్వెస్టర్‌ వదిలిన కొయ్యలను తొలగించాలంటే ఎకరానికి 10-12 మంది కూలీలు కావాలి. దీనికంటే పంట వ్యర్థాల దహనం మేలని రైతులు భావిస్తున్నారు. కొయ్యలను భూమిలో కలిపేస్తే పంటకు ఎరువుగా ఉపయోగపడతాయి. యూరియా వినియోగం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, రైతులు రిస్క్‌ తీసుకోవడం లేదు. కాగా, ‘చిప్పర్లు’ అనే యంత్రాలతో వరి కొయ్యలను చిన్నగా కట్‌ చేయొచ్చని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కన్నెగంటి రవి తెలిపారు. పీఏసీఎ్‌సలు, ఎఫ్‌పీవోల ద్వారా వీటిని రైతులకు అందించాలని సూచిస్తున్నారు. యాసంగిలో పెసర్లు, మినుములు, పప్పు ధాన్యాలు, వేరుశఽనగ, నువ్వులు తదితర నూనె గింజలు సాగుచేస్తే... వానాకాలంలో వరి సాగుకు సమయం సరిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ జలపతిరావు పేర్కొంటున్నారు పంజాబ్‌, హరియాణాలో వానాకాలంలో వరి, యాసంగిలో గోధుమ వేస్తారని, తెలంగాణ రైతులు కూడా దీనిపై దృష్టిపెట్టాలని రాష్ట్ర రైతుసంఘం ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి వివరిస్తున్నారు.

Updated Date - May 20 , 2024 | 04:25 AM