Share News

Farmer Suicide: ప్రాణాలు తీసిన అప్పులు!

ABN , Publish Date - Dec 23 , 2024 | 05:05 AM

సాగు చేసిన పంటలు చేతికిరాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ముగ్గురురైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Farmer Suicide: ప్రాణాలు తీసిన అప్పులు!

  • ముగ్గురు రైతుల బలవన్మరణం

సీరోలు, హవేళిఘణపూర్‌, మల్లాపూర్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సాగు చేసిన పంటలు చేతికిరాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ముగ్గురురైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలు మహబూబాబాద్‌, మెదక్‌, జగిత్యాల జిల్లాల్లో జరిగాయి. మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు సక్రాంనాయక్‌ తండాకు చెందిన రైతు తేజావత్‌ శ్రీను(38) రెండు లక్షలు అప్పుచేసి మిరపతోట వేయగా చీడపీడలతో తీవ్రనష్టం వాటిల్లింది. మనస్థాపంతో ఈనెల 21న పురుగు మందుతాగాడు. ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.


మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండలం కూచన్‌పల్లికి చెందిన రైతు ఈర్ల ప్రవీణ్‌ (35) వ్యవసాయంతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. రూ.3 లక్షల అప్పు చేసి ఎకరం పొలంలో వరి సాగు చేయగా దిగుబడి సరిగ్గా రాలేదు. దీంతో అప్పులు తీర్చలేక శనివారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మిట్టపల్లి జీవన్‌రెడ్డి(38) వరి, మొక్కజొన్న, మిర్చి పంటలను సాగు చేయగా నష్టాలు వచ్చాయి. అప్పులు పెరిగిపోవడంతో శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - Dec 23 , 2024 | 05:05 AM