Nalgonda: మైనార్టీ గురుకులం నుంచి ముగ్గురు విద్యార్థుల పరార్‌మైనార్టీ గురుకులం నుంచి ముగ్గురు విద్యార్థుల పరార్
ABN , Publish Date - Sep 19 , 2024 | 04:48 AM
నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కొండభీమనపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు గోడ దూకి పరారయ్యారు.
గురుకుల ఆవరణలోకి కల్లు ప్యాకెట్లు
గుర్తించి ప్రశ్నించిన ఉపాధ్యాయులు, సిబ్బంది
ప్రిన్సిపాల్ మందలిస్తారన్న భయంతో పరార్?
దేవరకొండ/మహేశ్వరం, సెప్టెంబరు 18: నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కొండభీమనపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు గోడ దూకి పరారయ్యారు. మైనార్టీ గురుకుల పాఠశాలల జిల్లా రీజనల్ కో-ఆర్డినేటర్ విష్ణుమూర్తి, పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 16న మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు గురుకుల పాఠశాల ప్రహరీ పైనుంచి లోపలికి 3 ప్యాకెట్లను విసిరారు. వాటిని ముగ్గురు విద్యార్థులు తీసుకున్నారు. ఉపాధ్యాయులు గమనించి విద్యార్థులను ప్రశ్నించగా బిర్యానీ పొట్లాలు వచ్చాయని తెలిపారు. ఉపాధ్యాయులు పరిశీలించగా వాటిలో కల్లు ఉన్నట్లు తేలింది.
ఆ ప్యాకెట్లను ఎవరు వేశారని ప్రశ్నించగా, తమకు తెలియదని విద్యార్థులు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నుంచి ముగ్గురు విద్యార్థులు కనపడకపోవడంతో ఉపాధ్యాయులు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ హనుమంతు అశోక్ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా పాఠశాల గోడ దూకి పరారైనట్లు గుర్తించారు. వెంటనే ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు, నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ విష్ణుమూర్తికి సమాచారమిచ్చారు. ఘటనపై బుధవారం దేవరకొండ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు.. విద్యార్థులను వెతికేందుకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములునాయక్ తెలిపారు.
బుధవారం దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, ఆర్డీవో శ్రీరాములు పాఠశాలలో విచారణ నిర్వహించారు. కాగా, కల్లు ప్యాకెట్లు బయటనుంచి గురుకులంలోకి రావడంతో ప్రిన్సిపాల్ మందలిస్తారనే భయంతోనే విద్యార్థులు పారిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. ‘తల్లిదండ్రులు మా గురించి వెతకొద్దు.. నా జీవితం నేను చూసుకుంటాను. నా తరఫున తప్పు జరిగి ఉంటే క్షమించండి’ అంటూ పారిపోయిన విద్యార్థుల్లో ఒకరు రాసినలేఖను అతని పెట్టెలో గుర్తించారు. ‘మేము ముగ్గురం కలిసి పారిపోతున్నాం. 10 సంవత్సరాల తర్వాత మళ్లీ కలుద్దాం’ అని ఆ లేఖలో రాసి ఉంది.
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హాస్టల్‌లో ఉంటూ చదవడం ఇష్టం లేదని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని బీసీ సంక్షేమ గురుకుల వసతి గృహంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన కె.సిద్ధు గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం సిద్ధు తరగతి గది భవనం మొదటి అంతస్థుపైకి ఎక్కి కిందకు దూకాడు. తీవ్ర గాయాలైన సిద్ధును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.