Share News

Tiger Attack: పత్తి చేలో పులి పంజా.. యువతి మృతి

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:21 AM

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ యువతిపై శుక్రవారం పులి దాడి చేసింది. కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.

Tiger Attack: పత్తి చేలో పులి పంజా.. యువతి మృతి

  • పత్తి ఏరుతుండగా దాడి చేసిన పెద్దపులి

  • మెడపై గాయం.. ఆస్పత్రికి వెళ్లేలోపే మృతి

  • ఆసిఫాబాద్‌ జిల్లా నజ్రూల్‌నగర్‌లో ఘటన

  • రూ.20 లక్షలు, ఐదెకరాలు, ఇంట్లో ఒకరికి

  • ఉద్యోగం ఇచ్చేందుకు అటవీ శాఖ ఓకే

కాగజ్‌నగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ యువతిపై శుక్రవారం పులి దాడి చేసింది. కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. కాగజ్‌నగర్‌ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోహిర్లె లక్ష్మి(22) తోటి మహిళలతో కలిసి నజ్రూల్‌నగర్‌లోని పత్తి చేనులో పని చేసేందుకు శుక్రవారం ఉదయం వెళ్లింది. లక్ష్మి పత్తి ఏరుతుండగా అక్కడే మాటు వేసి ఉన్న ఓ పులి ఆమెపై దాడి చేసి మెడ భాగాన్ని కరించింది. ఈ దాడిని గమనించిన తోటి కూలీలు కేకలు వేయడంతో లక్ష్మిని వదిలేసి పులి పొలాల్లోకి పారిపోయింది.


పులి దాడిపై అటవీ శాఖకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు లక్ష్మిని కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణం విడిచింది. దీంతో స్థానికులు, రాజకీయ పార్టీల నాయకులు కలిసి లక్ష్మి మృతదేహంతో అటవీ శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. లక్ష్మి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయా డిమాండ్లను నెరవేరుస్తామని అధికారులు అంగీకరించడంతో ఆందోళన విరమించారు. కాగా, లక్ష్మికి ఏడాదిన్నర క్రితమే వివాహమైంది.

Updated Date - Nov 30 , 2024 | 04:21 AM