Share News

Tomato prices: ఠారెత్తిస్తున్న టమాటా!

ABN , Publish Date - Jul 18 , 2024 | 03:45 AM

కిలో టమాటా ధర సెంచరీ దాటింది. ధర దడపుటిస్తుండటంతో టమాటా కొనేందుకు సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు.

Tomato prices: ఠారెత్తిస్తున్న టమాటా!

  • బహిరంగ మార్కెట్‌లో సెంచరీ దాటిన ధర

  • రైతు బజార్లలో 67-70, ఉల్లిగడ్డకూ రెక్కలు

  • వర్షాలతో 60 శాతం తగ్గిన టమాటా రాక

హైదరాబాద్‌ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కిలో టమాటా ధర సెంచరీ దాటింది. ధర దడపుటిస్తుండటంతో టమాటా కొనేందుకు సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నారు. రైతు బజార్లలో కిలో టమాటా రూ.67-70 వరకు ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.100-110 పలుకుతోంది. ఇక కిలో రూ.20-25 ఉండాల్సిన ఉల్లిగడ్డ ధర రెట్టింపు అయింది. వర్షాల కారణంగా టమాటా, ఉల్లిగడ్డ దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగినట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం రోడ్డు పక్కన ట్రాలీ ఆటోలపై రూ.100కు 4 కిలోలు, రైతు బజార్లలోలో 3 కిలోలు వచ్చిన టమాటా ధర సామాన్యుల ఠారెత్తిస్తోంది.


హైదరాబాద్‌ శివారులోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం రైతుల నుంచి కూడా మార్కెట్‌కు లోకల్‌ టమాటా పెద్దగా రావడం లేదు. ఏపీలోని మదనపల్లి, రాజస్థాన్‌ నుంచి నగరానికి వచ్చే టమాటా 60 శాతం తగ్గిపోవడంతో ధరలు పెరిగాయని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. షోలాపూర్‌, నాసిక్‌, అహ్మద్‌నగర్‌, పుణె తదితర ప్రాంతాల నుంచి మలక్‌పేట మార్కెట్‌కు రోజు సుమారు 90-100 ఉల్లిగడ్డ లారీలు వస్తుండేవని, నెల రోజులుగా ఆ సంఖ్య 30-60 వరకు తగ్గిపోయిందన్నారు.


వర్షాలతో పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన పంట దెబ్బతింటోంది. దీంతో రైతు బజార్ల నుంచి సూపర్‌ మార్కెట్ల వరకు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. టమాటా, ఉల్లిగడ్డతో పాటు ములక్కాయ, క్యాప్సికమ్‌ రేట్లు కూడా గరిష్ఠంగా పెరిగాయి. మరో 20 రోజులైతే ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని బోయిన్‌పల్లి హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్‌ ప్రతినిధి గిరిధర్‌ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో సరుకు దిగుమతి కాకపోవడంతో ఉన్న వాటిపై రిటైల్‌ మార్కెట్‌లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jul 18 , 2024 | 08:46 AM