Jaggareddy: వరద నష్టం రూ.7 వేల కోట్లు
ABN , Publish Date - Sep 05 , 2024 | 04:27 AM
రాష్ట్రంలో వరదలు రావడంతోనే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సహా ప్రభుత్వ యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలోనే ఉండి.
మోదీతో మాట్లాడి నివేదిక పంపిన రేవంత్
సీఎం, మంత్రులు క్షేత్రస్థాయిలోనే..
పదేళ్లుగా ఇంటికే పరిమితమైన కేసీఆర్..
మేము పనికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం
బీఆర్‌ఎస్ వాళ్లది కేవలం ప్రచారమే
హరీశ్.. బాబును ఎప్పుడు పొగుడుతారో ఎప్పుడు తిడుతారో తెలియదు
ప్రతిపక్షంగా ఎలా ఉండాలో అడిగితే బీఆర్‌ఎ్‌సకు శిక్షణ ఇస్తాం: తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరదలు రావడంతోనే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సహా ప్రభుత్వ యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలోనే ఉండి.. వరద బాధితులకు సహాయ సహకారాలు అందించే పనిలోనే పడిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో వరదల కారణంగా రూ.7 వేల కోట్ల మేరకు పంట, ఆస్తి నష్టం జరిగినట్లుగా నివేదికలూ కేంద్రానికి పంపారన్నారు.
కానీ.. సీఎంగా పదేళ్ల పాటు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగానూ కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారన్నారు. ఆయన ప్రజల్లోకి రారని, ఇంటి నుంచే అంతా నడిపిస్తారని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకత్వం ఎప్పుడూ పనికి ఎక్కువ, ప్రచారానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తాయని చెప్పారు. కానీ బీఆర్‌ఎస్ వాళ్లు మాత్రం పబ్లిసిటీకి దగ్గరగాను, పనికి దూరంగా ఉంటారన్నారు.
ముందుగా సమస్యలు చెప్పి.. తర్వాత పరిష్కారం అడగాలి
ఒక రాజకీయ పార్టీ నాయకునిగా ఖమ్మంకు హరీశ్‌రావు వెళ్లడం తప్పుకాదని జగ్గారెడ్డి అన్నారు. అక్కడ ఆయన దృష్టికి వచ్చి న సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాలన్నారు. ‘‘ముందుగా సమస్యలు చెప్పి ఆ తర్వాత పరిష్కారం అడగాలి. కానీ.. ఖమ్మం వెళ్లక ముందే హరీశ్ రావు విమర్శలు చేయ డం ఏంది? ఇది రాజకీయాలు చేసే సమయమా? ముగ్గురు మంత్రులు ఏం చేయట్లేదంటున్న ఆయన.. ఏం చేయాలో చెప్పట్లేదు. ఇలాంటి సమయాల్లో ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలో మమ్మల్ని అడిగితే శిక్షణ ఇస్తాం కదా?’’ అన్నారు. తమకు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న అనుభవం ఉందని చెప్పారు. కాగా.. హరీశ్ రావు, ఆయన ఫ్యామిలీ.. చంద్రబాబును ఎప్పుడు పొగుడుతారో, ఎప్పుడు తిడతారో తెలియదన్నారు.
వరదల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల పనితనాన్ని మెచ్చుకోలేక.. లేని బురదను తమ ప్రభుత్వంపై చల్లుతూ ఏపీ సీఎం చంద్రబాబును మెచ్చుకుంటున్నారన్నారు. ఏపీలోని ప్రతిపక్షమేమో.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనితనం బాగుందని అంటోందన్నారు. అక్కడి ప్రతిపక్షం.. ఇక్కడి ప్రభుత్వం పనితీరును, ఇక్కడి ప్రతిపక్షం.. అక్కడి ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నాయన్నారు. ఖమ్మంలో వరదలు రాగానే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి స్థానికంగానే ఉండి సమీక్షలు చేశారని, ప్రజల ఇబ్బందులను తొలగించే పనిలో పడిపోయారన్నారు. మహబూబాబాద్‌లో సీఎం రేవంత్, సీతక్క, మెదక్‌లోరాజనర్సింహ పర్యటించారన్నారు. సాగునీటి శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని ఆయన చెప్పారు.