Traffic Update: హైదరాబాద్-విజయవాడ రాకపోకలు షురూ
ABN , Publish Date - Sep 03 , 2024 | 04:05 AM
హైదరాబాద్-విజయవాడ రూట్లో రాకపోకలు మొదలయ్యాయి! అయితే ఈ రహదారిలో ఇబ్బందులు పూర్తిగా తొలగిపోలేదు.
నల్లగొండ, కోదాడ, హైదరాబాద్, కోహెడ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-విజయవాడ రూట్లో రాకపోకలు మొదలయ్యాయి! అయితే ఈ రహదారిలో ఇబ్బందులు పూర్తిగా తొలగిపోలేదు. నల్లగొండ జిల్లా కోదాడ వద్ద పాలేరు వంతెన వద్ద వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో నార్కట్‌పల్లి నుంచి నార్కట్‌పల్లి- అద్దంకి రహదారి మీదుగా మళ్లించారు. వాహనాలు పెరగడంతో రద్దీ కొనసాగింది. నార్కట్‌పల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, దామరచర్ల మీదుగా వాహనాలు విజయవాడకు వెళుతున్నాయి. హైదరాబాద్ లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ నదికి వరద తగ్గింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగెం, రుద్రవెల్లి బ్రిడ్జిల నుంచి రాకపోకలకు అనుమతిచ్చారు. జాతీయ రహదారి 65పై పాలేరు బ్యాక్‌వాటర్ రావడంతో రెండు రోజులుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం వరద నీరు తగ్గడంతో తిరిగి రాకపోకలు కొనసాగాయి. విజయవాడ-హైదరాబాద్ రూట్లో ఏపీ పరిధిలోని గరికపాడు వద్ద పాత వంతెన కుంగిపోవడంతో కొత్తవంతెన నుంచి రాకపోకలకు అనుమతించారు. గరికపాడు వద్ద కుంగిన పాత వంతెనను, నడిగూడెం మండలం కాగిత రాంచంద్రాపురం వద్ద సాగర్ ఎడమకాల్వకు ఏర్పడిన గండి పడిన ప్రదేశాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు.
కోదాడ పాలేరు వంతెన పొంగిపొర్లుతుండటంతో సూర్యాపేట జిల్లా సరిహద్దులోని దుర్గాపురం నుంచి రామాపురం క్రాస్ రోడ్డు వరకు దాదాపు 2కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం-విజయవాడ రూట్లో వరద తగ్గకపోవడంతో రాకపోకలు కొనసాగడం లేదు. ఈ రూట్లో సోమవారం 590 ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వునుంచి కోదాడకు వెళ్లే రహదారిపై కందిబండ గ్రామంలో వంతెన కూలిపోయింది. ప్రమాద సమయంలో వాహనాలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.