Share News

Hyderabad: ‘పుష్పా’ అని పిలుచుకునేవాళ్లు!

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:22 AM

అభిమాన నటుడి సినిమా తొలి షో చూద్దామన్న చిన్నారి శ్రీతేజ్‌ ఆశ.. ఆ నిండు కుటుంబంలో తీరని విషాదం నింపింది! థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో కన్నతల్లి చనిపోయిందన్న విషయమైనా తెలియని ఆ బాలుడు.. అపస్మారక స్థితిలో ఆస్పత్రి మంచంపై చికిత్స పొందుతున్నాడు!!

Hyderabad: ‘పుష్పా’ అని పిలుచుకునేవాళ్లు!

  • హీరో అల్లు అర్జున్‌అభిమాని శ్రీతేజ్‌

  • సినిమాకి వెళ్లి కన్నతల్లిని కోల్పోయి..

  • ఆస్పత్రిలో ఆందోళనకరస్థితిలో బాలుడు

  • తొక్కిసలాట సమయంలో భర్తకు రేవతి ఫోన్‌

  • తర్వాత స్విచాఫ్‌ రావడంతో అతడిలో కంగారు

  • పోలీసుల సమాచారంతో ఆస్పత్రికి పరుగులు

  • భార్య చనిపోయినట్టు తెలిసి కన్నీటి పర్యంతం

చాదర్‌ఘాట్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): అభిమాన నటుడి సినిమా తొలి షో చూద్దామన్న చిన్నారి శ్రీతేజ్‌ ఆశ.. ఆ నిండు కుటుంబంలో తీరని విషాదం నింపింది! థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో కన్నతల్లి చనిపోయిందన్న విషయమైనా తెలియని ఆ బాలుడు.. అపస్మారక స్థితిలో ఆస్పత్రి మంచంపై చికిత్స పొందుతున్నాడు!! శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ ఒక బంగారం దుకాణంలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. తల్లి రేవతి గృహిణి. శ్రీతేజ్‌ చెల్లెలు సాన్విక (7). వారు మూసారాం బాగ్‌లోని శాలివాహన నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. పిల్లలిద్దరూ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. చిన్నప్పటి నుంచీ అల్లు అర్జున్‌ సినిమాలను బాగా ఇష్టపడే శ్రీతేజ్‌.. పుష్ప సినిమా విడుదలైనప్పటి నుంచి అవే హావభావాలను అనుకరించేవాడు. దాంతో.. కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవారు అంతా అతణ్ని ముద్దుగా ‘పుష్పా’ అని పిలిచేవారు. కుమారుడికి అల్లు అర్జున్‌ అంటే ఇంత ఇష్టం కావడంతోనే.. భాస్కర్‌ ఎంతో కష్టపడి సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్‌ షో టికెట్లు తీసుకున్నారు. థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన సమయంలో భాస్కర్‌ సాన్విక చేతిని పట్టుకుని ఉండగా.. రేవతి శ్రీతేజ్‌ చేతిని పట్టుకుని ఉన్నట్టు సమాచారం.


తోపులాటకు వీరు చెరోవైపునకూ వెళ్లిపోయారు. ఆ సమయంలో భర్తకు ఫోన్‌ చేసిన రేవతి.. తాను ముందుకు వచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి భాస్కర్‌ మళ్లీ ఫోన్‌ చేసేసరికి ఆమె ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చింది. 10-15 నిమిషాలపాటు ప్రయత్నించినా ఫోన్‌ కలవకపోవడంతో ఆయన ఆందోళనగా అటూఇటూ పరుగులు తీస్తూ భార్య, కుమారుడి కోసం గాలిస్తూ, అక్కడున్న పోలీసులకు విషయం తెలిపారు. పోలీసులు తమ ఫోన్‌లో ఉన్న బాలుడి ఫొటో చూపగా.. అది శ్రీతేజ్‌దేనని గుర్తించారు. స్పృహకోల్పోయిన తన భార్యని, కుమారుణ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు తెలియగానే.. అక్కడికి పరుగు తీశారు. అక్కడికి వెళ్లే సరికే తన భార్య మరణించిందని.. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. కాగా.. శ్రీతేజ్‌ అల్లు అర్జున్‌ను అనుకరిస్తూ చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుుతోంది. ఇక.. రేవతి మృతితో శాలివాహన నగర్‌లోని వారి ఇంటివద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. ఒక్కక్షణంలో ఛిన్నాభిన్నమైన ఆ కుటుంబాన్ని తల్చుకుని అంతా కంటతడి పెడుతున్నారు. కొన్నాళ్ల క్రితం భాస్కర్‌ కాలేయం పాడైతే.. రేవతి తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చి భర్తను బతికించుకుందని కుటుంబసభ్యులు, తెలిసినవారు గుర్తుచేసుకుంటున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 03:22 AM