Exam Issues: అధికారుల నిర్లక్ష్యమే ఆమెకు శాపం
ABN , Publish Date - Dec 16 , 2024 | 04:39 AM
జనగామ జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో ఓ గిరిజన అభ్యర్థిని పరీక్ష రాసే అవకాశం కోల్పోయింది. కొడకండ్ల మండలం వాస్త్యా తండాకు చెందిన భూక్యా సునీత అనే బాలింత ఆదివారం జనగామలో పక్కపక్కనే ఉన్న రెండు పరీక్షా కేంద్రాల్లో ఒకటైన సెయింట్ మేరీ్‌సకు అరగంట ముందుగానే వెళ్లింది.
ముందు అనుమతించి.. తర్వాత పరీక్షా కేంద్రం అది కాదన్నారు
పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన జనగామ గిరిజన అభ్యర్థిని
జనగామ కల్చరల్: జనగామ జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో ఓ గిరిజన అభ్యర్థిని పరీక్ష రాసే అవకాశం కోల్పోయింది. కొడకండ్ల మండలం వాస్త్యా తండాకు చెందిన భూక్యా సునీత అనే బాలింత ఆదివారం జనగామలో పక్కపక్కనే ఉన్న రెండు పరీక్షా కేంద్రాల్లో ఒకటైన సెయింట్ మేరీ్‌సకు అరగంట ముందుగానే వెళ్లింది. అధికారులు గేటు దగ్గర హాల్ టికెట్ పరిశీలించి లోపలికి అనుమతించారు. ఓఎంఆర్ షీటు బయోమెట్రిక్ సమయంలో ఆమె పరీక్షా కేంద్రం అది కాదని, పక్కనే ఉన్న సాన్ మారియా పాఠశాలగా గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లినా సమయం దాటిపోవడంతో అధికారులు అనుమతించలేదు. జరిగిన విషయం చెప్పినా ససేమిరా అన్నారు.
దాంతో ఆమె తన చిన్నపాపతో పరీక్షా కేంద్రం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో టీజీపీఎస్సీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. నిబంధనల పేరుతో అధికారులు అతిగా ప్రవర్తించి సమస్యలు సృష్టించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మహిళల మంగళసూత్రాలతో సహా ఆభరణాలు, అభ్యర్థులు బూట్లు, చేతి కంకణాలు తొలగించాలనడం, దివ్యాంగుల వాహనాలను పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరంగా పెట్టాలనడంతో ఇబ్బందులకు గురయ్యామని వారు తెలిపారు.