Tumala: వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లకు పూర్వ వైభవం!
ABN , Publish Date - Oct 09 , 2024 | 03:36 AM
ఐదేళ్లుగా రాష్ట్రంలో నిర్వీర్యమైన వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చెయ్యండి
వచ్చే ఆగస్టుకు సిద్దిపేట ఆయిల్ పామ్ పరిశ్రమ
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లుగా రాష్ట్రంలో నిర్వీర్యమైన వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలా ఉపయోగపడాలి ? లాభదాయక వ్యాపారాలు ఎలా చేయాలి ? ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం కావాలి? అనే అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు టీజీ సీడ్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, టెస్కో, హాకా, వేర్ హౌసింగ్, ఆయిల్‌ఫెడ్, సీడ్ సర్టిఫికేషన్‌తదితర కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులతో సమావేశమైన తుమ్మల.. పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..ఈ-కామర్స్, చేనేతలక్ష్మీ తదితర కార్యక్రమాల ద్వారా చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పించాలని, టెస్కో అమ్మకాలు పెంచాలని సూచించారు. పోచంపల్లి టెక్స్‌టైల్ పార్కును అందుబాటులోకి తేవాలని, సిద్దిపేటలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ పరిశ్రమ ఆగస్టు నెలాఖరుకు వినియోగంలోకి రావాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని గిడ్డంగులు, కోల్ట్ స్టోరేజీలను అందుబాటులోకి తేవాలని, ఇప్పటికే ఉన్నవాటిలో ఆధునికీకరణ పనులు చేపట్టాలని అన్నారు. అలాగే, గిడ్డంగుల సంస్థ కార్యక్రమాలకు సంబంధించిన ‘క్విక్సీ’ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించి కొన్ని సూచనలు చేశారు.
కాగా, స్త్రీ శక్తి మహిళలు(స్వయం సహాయక సంఘాలకు చెందిన వారు) ఒక్కొక్కరికిఏడాదికి రెండేసి నాణ్యమైన చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ మేరకు మహిళలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన పీతాంబరి, గొల్లభామ, ఆర్మూర్, రామప్ప, టస్సార్ సిల్కు రకాల చీరలను పరిశీలించారు. ఆయా చీరలను ముఖ్యమంత్రికి చూపించి తుది నిర్ణయం తీసుకోవాలని చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్‌కు సూచన చేశారు. కాగా, నారాయణపేటలో చేపట్టిన సెంటర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్సలెన్స్ నిర్మాణం త్వరలో పూర్తికానుందని, అక్కడ సేల్స్ షోరూంలు, ఫుడ్ కోర్ట్, నేచురల్ డై యూనిట్, కెమికల్ డై యూనిట్, వీవింగ్ హబ్, ట్రైనింగ్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.