Tummala Nageshwar Rao: రైతు సంక్షేమానికి రూ.50-60 వేల కోట్లు
ABN , Publish Date - Jul 03 , 2024 | 03:41 AM
రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం రైతు సంక్షేమమని, రానున్న మూడు నెలల కాలంలో అందుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్...
రానున్న మూడు నెలల్లో వ్యయం: మంత్రి తుమ్మల
హైదరాబాద్, రాజేంద్రనగర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం రైతు సంక్షేమమని, రానున్న మూడు నెలల కాలంలో అందుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాలకు ఈ నిధులు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
అధికారులకు ఖరీ్‌ఫలో చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని,. ఇప్పటికే మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను తిరిగి వాడుకలోకి తెచ్చామని తుమ్మల అన్నారు. రైతుబీమా పథకంలో 1,222 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, ఇంత పెద్దమొత్తంలో పెండింగ్ ఉంటే ఎలా అన్నారు.
పంటల నమోదులో కచ్చితత్వం ఉండాలన్నారు. ఆయిల్ పామ్ ప్రాజెక్టు చేపట్టి మూడో సంవత్సరంలోకి వచ్చినా 2023-24లో 2.30 లక్షల ఎకరాల లక్ష్యానికిగాను కేవలం 59,200 ఎకరాలు మాత్రమే పురోగతి చూపెట్టారని, ఇది కేవలం 26 శాతమేనని అన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు ఒక బృందంగా ఏర్పడి జిల్లాల్లో కనీసం వారానికి రెండు మండలాలు సందర్శించి రైతులకు సలహాలివ్వాలని ఆదేశించారు. బిందుసేద్యం సబ్సిడీని ఆయిల్‌పామ్‌తోపాటు ఇతర పంటలకు 70,600 ఎకరాలకు ఇస్తున్నామని.. ఉద్యాన, కూరగాయ పంటల సాగును ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.