Hyderabad: రేపట్నుంచి ప్రపంచ వరి సదస్సు
ABN , Publish Date - Jun 06 , 2024 | 03:43 AM
రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ప్రపంచ వరి సదస్సుకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో జూన్ 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సు-2024 జరగనుంది.
హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు నిర్వహణ
రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులను
ప్రోత్సహించడమే లక్ష్యం: తుమ్మల
హైదరాబాద్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ప్రపంచ వరి సదస్సుకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో జూన్ 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సు-2024 జరగనుంది. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఫిలిప్పైన్స్), అంతర్జాతీయ కమోడిటీస్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్యర్యంలో రెండ్రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్పత్తయ్యే సన్నాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉందని చెప్పారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలు వరి దిగుమతుల కోసం భారత్ వైపు చూస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని తెలంగాణ రైతులు ఉపయోగించుకోవాలనే లక్ష్యంగా ప్రపంచ వరి సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ వ్యవసాయ వర్సిటీల నిపుణులు, శాస్త్రవేత్తలు, 30దేశాలకు చెందిన ఎగుమతి, దిగుమతిదారులు, మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, రాష్ట్రంలోని ఆదర్శ రైతులు ఈ సదస్సులో పాల్గొంటారని మంత్రి తుమ్మల తెలిపారు.