Tummala Nageswara Rao: పత్తి విత్తనాలకు కొరతే లేదు...
ABN , Publish Date - May 30 , 2024 | 04:02 AM
రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరతలేదని, పత్తిసాగు విస్తీర్ణానికి సరిపడా విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విత్తన కంపెనీలతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
సాగుకు సరిపడా ఉన్నాయి
విపక్షాలవి అసత్య ఆరోపణలు
రైతులపై లాఠీచార్జి కూడా అవాస్తవం
ఈసారి 1.24 కోట్ల పత్తివిత్తన ప్యాకెట్లు
ఇప్పటికే 51 లక్షల ప్యాకెట్లు అందుబాటులో
10 లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొన్నారు
గందరగోళం సృష్టిస్తే ఉపేక్షించం: తుమ్మల
రైతులకు విత్తనాలు అందేలా చూడండి
కలెక్టర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ లేఖ
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరతలేదని, పత్తిసాగు విస్తీర్ణానికి సరిపడా విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విత్తన కంపెనీలతో గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. 2023-24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తిపంట సాగుకాగా... ఈ వానాకాలానికి 55 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అంచనావేసి 1.24కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచడానికి ప్రణాళిక వేశామని, ఇప్పటిదాకా 51,40,405 పత్తి ప్యాకెట్లు వివిధ జిల్లాల్లో రైతులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 10,39,040 ప్యాకెట్లను విత్తనాలు రైతులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పత్తి విత్తనాల కొరత ఉన్నట్లు కొందరు విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని, అది అవాస్తవమని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో రైతులు ఒకే కంపెనీకి చెందిన ఒకే వెరైటీ విత్తనాలు అడగటంతో... రైతులను ‘క్యూ’ లో నిల్చోబెట్టి ఒక్కో రైతుకు రెండు ప్యాకెట్ల చొప్పున పంపిణీచేశారని, అంతేతప్ప మార్కెట్లో గానీ, జిల్లాల్లోగానీ విత్తనాల కొరతలేదని తెలిపారు. రైతులు ఒకే కంపెనీ విత్తనాలకోసం పోటీపడకుండా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సూచించిన పలురకాల హైబ్రీడ్ విత్తనాలు తీసుకోవాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులొస్తాయని తుమ్మల తెలిపారు.
నకిలీ విత్తన విక్రేతలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 1966 విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రూ. 2.49 కోట్ల విలువైన 188.29 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. నిరుడు వానాకాలంలో రూ. 66.81 కోట్ల సబ్సిడీతో 1.27 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేశారని, ఈ తేదీ నాటికి కేవలం 24,898 క్వింటాళ్లు మాత్రమే రైతులకు పంపిణీచేశారని, ఈ వానాకాలం సీజన్‌కు రూ. 109.15 కోట్ల సబ్సిడీ విలువతో 1.95 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 79,261 క్వింటాళ్లు పంపిణీ చేశామని, అందులో 54,162 క్వింటాళ్లు రైతులు కొనుగోలు చేశారని, నిరుటితో పోలిస్తే 29 వేల క్వింటాళ్లు ఎక్కువగా పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ ఈసీ నుంచి అనుమతులు తీసుకొని టెండర్ల ప్రక్రియ పూర్తిచేయడమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో పంపిణీదారులకు చెల్లించకుండా ఉన్న బకాయిలను ఈ ప్రభుత్వం విడుదలచేసినట్లు తెలిపారు.
విత్తనాల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, సొసైటీల పరిధిలోని రైతులకు విత్తనాలపై వచ్చిన సమాచారంతో కొంత గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రైతుల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించేవారిని ఇకమీదట ఉపేక్షించేదిలేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. ఎరువుల కొరతకూడా రాష్ట్రంలో లేదని, అన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నిరుడు వానాకాలం సీజన్లో ఈ సమయానికి 4,24,160 టన్నుల యూరియా ఉంటే.. ఈసారి 6,88,382 టన్నులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డీఏపీ అప్పుడు 1,19,888 లక్షల టన్నులు, ఈఏడాది 79,376 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు నిరుడు 3,76,897 లక్షల టన్నులు అందుబాటులో ఉంచితే.. ఈ సీజన్లో 4,21,718 టన్నులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎంవోపీ నిరుడు 8,729 టన్నులు ఉంచితే, ఇప్పుడు 24,984 టన్నులు, ఎస్‌ఎ్‌సపీ నిరుడు 17,993 టన్నులు అందుబాటులో ఉంచితే... ఇప్పుడు 13,997 టన్నులు, మొత్తం కలిపి నిరుడు 9,47,667 టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచితే.. ఈ ఏడాది ప్రభుత్వం 12,28,457 టన్నులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
విత్తనాలు, ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచిన ఈ ప్రభుత్వానికి ప్రణాళికలేదని, ఎరువులు, విత్తనాలను తగినంతగా సరఫరా చేయటంలేదని విపక్ష నేతలు ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని అన్నారు. కాగా అన్ని జిల్లాల్లో అవసరమైన పత్తి, పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి జిల్లా కలెక్టర్లను కోరారు. ఈ మేరకు ఏఏ జిల్లాలో ఏఏ విత్తనాలు ఎంత స్టాక్ ఉన్నాయో తెలియజేస్తూ కలెక్టర్లకు బుధవారం లేఖ రాశారు. ఈ సీజన్ కోసం 1.41 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను, 1.26 కోట్ల పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎక్కడ కూడా విత్తనాలకు ఎలాంటి కొరత లేదన్నారు.