Tummala : తెలంగాణలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పండి!
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:43 AM
రాష్ట్రంలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని మలేషియా దేశ వ్యవసాయ మంత్రి మహ్మద్ బిన్ సాబుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
మలేషియా ప్రభుత్వానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని మలేషియా దేశ వ్యవసాయ మంత్రి మహ్మద్ బిన్ సాబుకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మలేషియా పర్యటనలో ఉన్న మంత్రి.. శుక్రవారం పలు ప్రతిపాదనలు అక్కడి ప్రభుత్వం ముందు ఉంచారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరగా, మలేషియా వ్యవసాయశాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఫెల్డా చైర్మన్ అహ్మద్ షబేరీ చీక్‌తోపాటు తన ప్రతినిఽధి బృందంతో మంత్రి తుమ్మల సమావేశమై ఆయిల్ ఫామ్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు.
ఆయిల్ ఫాం రైతులకు ప్రయోజనకరంగా ఉండే పద్ధతులపై చర్చించారు. మలేషియాలో భారత హైకమిషనర్ బీఎన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెనాషియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సందర్శించి, యాంత్రీకరణకు సంబంధించి అక్కడ వివిధ రకాల యంత్రాలు, పనిముట్లు, వాటి పనివిధానాన్ని పరిశీలించారు. మలేషియా పర్యటనలో రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్‌భాషా, అడిషనల్ డైరెక్టర్ సరోజిని, ఓఎస్డీ శ్రీధర్ పాల్గొన్నారు.
పత్తి రైతుల సౌకర్యం కోసం ‘వాట్సప్’!
పత్తి రైతుల సౌలభ్యం కోసం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. 8897281111 అనే వాట్సప్ నెంబరుతో పత్తి రైతులు, పత్తి కొనుగోలు సంబంధిత ేసవలు తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. రైతు పత్తి అమ్మకం, అర్హత, అమ్మకాల వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే సమయం, కొనుగోళ్ల వివరాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్సప్ చాట్ ద్వారా తెలుసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు. అలాగే ఇబ్బందులున్నా వాట్సప్ ద్వారా తెలపాలని సూచించారు.