Tungabhadra Dam: తుంగభద్రలో ‘స్టాప్‌లాగ్’ సక్సెస్!
ABN , Publish Date - Aug 18 , 2024 | 03:27 AM
‘తుంగభద్ర’కు నీటి భరోసా దక్కింది. ‘ఆపరేషన్ స్టాప్‌లాగ్’ వందశాతం విజయవంతమైంది. కరువు సీమ రైతుల ఖరీఫ్ ఆశ సజీవంగా నిలిచింది.
తుంగభద్ర జలాశయంలో నిలిచిన నీరు
విజయవంతంగా ఐదు ఎలిమెంట్ల అమరిక
విజయవంతంగా ఐదు ఎలిమెంట్ల అమరిక.. డ్యామ్ వద్ద పండగ వాతావరణం
(రాయదుర్గం/బళ్లారి/కర్నూలు - ఆంధ్రజ్యోతి): ‘తుంగభద్ర’కు నీటి భరోసా దక్కింది. ‘ఆపరేషన్ స్టాప్‌లాగ్’ వందశాతం విజయవంతమైంది. కరువు సీమ రైతుల ఖరీఫ్ ఆశ సజీవంగా నిలిచింది. హోస్పేటలోని తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో... స్టాప్‌లాగ్ ఏర్పాటు ప్రక్రియ శనివారం విజయవంతంగా పూర్తయింది. క్రస్ట్‌గేట్ నిపుణుడు కన్నయ్యనాయుడు నేతృత్వంలో ఇంజనీర్లు, కార్మికులు మూడు రోజులపాటు పడిన శ్రమ ఫలించింది. శుక్రవారం రాత్రి అత్యంత ఉత్కంఠ నడుమ... స్టాప్‌లాగ్ తొలి ఎలిమెంట్‌ను డ్యామ్ స్పిల్‌వే బెడ్ మీద కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే.
శనివారం ఉదయం నుంచి మిగిలిన ఎలిమెంట్‌లను అమర్చే ప్రక్రియ మొదలుపెట్టారు. తొలి బ్లాక్ అమరికలో ఎదురైన అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని రెండో ఎలిమెంట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నీళ్లలో 1617 అడుగుల వరకు ఉన్న ఫస్ట్ ఎలిమెంట్‌పై రెండో ఎలిమెంట్‌ను జాగ్రత్తగా కూర్చోబెట్టారు. దీని ప్రయాణం ఏడు అడుగులు నీళ్లలో సాగింది. ఈ మొత్తం ప్రక్రియకు మూడు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు 3వ ఎలిమెంట్‌ను 19వ క్రస్ట్‌గేట్ వద్దకు తరలించి, నీటిలో దించడం ప్రారంభించారు. అప్పటికి నీటి ప్రవాహ ఒత్తిడి తగ్గిపోవడంతో దీనిని కొంత సులువుగానే అమర్చారు.
సాయంత్రం మూడు గంటల సమయానికి మూడో ఎలిమెంట్ అమరిక పూర్తయింది. దీంతో క్రస్ట్‌గేట్ వద్ద నీటి నిల్వ సామర్థ్యం 1625 అడుగులకు పెరిగింది. నీటి నిల్వలు అంతకంటే దిగువనే ఉండటంతో 19వ క్రస్ట్ గేట్ గ్యాప్ నుంచి దిగువకు నీటి ప్రవాహం ఆగిపోయింది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత నాలుగు, ఐదు ఎలిమెంట్లను రెండు గంటల వ్యవధిలో అమర్చారు. నాలుగో ఎలిమెంట్ అమర్చగానే డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 1629 అడుగులకు చేరింది. ఆ వెంటనే 32 క్రస్ట్‌గేట్లను దించేసి.. నదిలోకి వెళుతున్న 65 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని నిలిపి వేశారు. 5 స్టాప్‌లాగ్ ఎలిమెంట్ అమరిక ప్రక్రియ శనివారం సాయంత్రం 6.30 గంటలకు పూర్తయ్యింది.
స్టాప్‌లాగ్ ఎలిమెంట్‌లను అమర్చేందుకు తొలగించిన కౌంటర్ వెయిట్, హాయిస్ట్ ప్లాట్‌ఫాంను ఆదివారం ఉదయం యథాస్థానానికి చేరుస్తామని అధికారులు తెలిపారు. స్టాప్‌లాగ్‌ను ఐదు భాగాలుగా అమర్చడంతో... జాయింట్‌ల వద్ద 50 క్యూసెక్కుల నీరు లీక్ అవుతోంది. దీనిని కూడా ఆదివారం పూర్తిగా కట్టడి చేసి, లీకేజీ లేకుండా చేస్తామని తెలిపారు. కాగా, తుంగభద్ర జలాశయంలోకి శనివారం రాత్రికి ఎగువ నుంచి 84వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. డ్యామ్‌లో నీటి నిల్వ 72 టీఎంసీలు దాటాయి. దీంతో వారం రోజుల్లో జలాశయం నీటి నిల్వలు 105.78 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు అంచనావేశారు.
సత్కరించిన టీబీ బోర్డు
నీటి పరిరక్షణ కోసం శ్రమించిన నిపుణులు కన్నయ్య నాయుడు, ఇంజనీరింగ్ అధికారులు, స్టాప్‌లాగ్‌లను తయారు చేసిన జిందాల్, హిందూస్థాన్, నారాయణ ఇంజనీరింగ్ వర్క్ నిపుణులు, కార్మికులు, క్రేన్ ఆపరేటర్లు, డ్యాం వద్ద శ్రమించిన కార్మికులు.. మొత్తంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ తుంగభద్ర బోర్డు అధికారులు సత్కరించారు. డ్యాం మొత్తం ఫ్లడ్ లైట్ల వెలుతురులో పండుగ వాతావరణం నెలకొంది. కొట్టుకుపోయిన గేటు స్థానంలో వరద ప్రవాహ ఒత్తిడిలోనే స్టాప్‌లాగ్ ఎలిమెంట్లను విజయవంతంగా అమర్చడంలో కీలకపాత్ర పోషించిన ఎన్.కన్నయ్య నాయుడు రియల్ హీరో అంటూ ఇంజనీర్లు పొగడ్తలతో ముంచెత్తారు.
చిత్తూరు జిల్లాకు చెందిన కన్నయ్య నాయుడు గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో క్రేన్ తయారీలో ప్రతిభ చూపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో 260 పైగా ప్రాజెక్టులకు క్రస్ట్ గేట్లను డిజైన్ చేసి అమర్చిన అనుభవం ఆయన సొంతం. 80 ఏళ్ల వయస్సులో మండుటెండను సైతం లెక్క చేయకుండా... స్టాప్‌లాగ్ ఎలిమెంట్లను అమర్చడంలో కీలక పాత్ర పోషించారు.