TG Politics: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులూ జంప్?
ABN , Publish Date - Mar 30 , 2024 | 05:59 AM
పార్లమెంటు ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రె్‌సలోకి వెళ్లనున్నారా? హస్తం పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా
ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్‌లో చేరిక
పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలూ హస్తం గూటికి?
చట్టపరంగా ఇబ్బంది ఉండని సంఖ్యలోనే!
పార్లమెంటు ఎన్నికల్లోపే వస్తారంటున్న కాంగ్రెస్
నేతలు దిగిపోతుండడంతో ఖాళీ అవుతున్న ‘కారు’
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు ఎన్నికలకు బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థులుగా ప్రకటించిన మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లోకి (Congress) వెళ్లనున్నారా? హస్తం పార్టీలోకి వెళ్లి అక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్‌రెడ్డి కాంగ్రె్‌సలో చేరగా, తాజాగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేసి.. హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. వీరు బీఆర్‌ఎస్ అభ్యర్థిత్వాలను వదులుకుని పార్టీని వీడడం, వీరినే కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థులుగా నిలుపుతుండడంతో ఇంకా ఎవరెవరు వెళతారోనన్న ఆందోళన గులాబీ శిబిరంలో మొదలైంది. వాస్తవానికి గత ఎన్నికల వరకు బీఆర్‌ఎస్ టికెట్ తమకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలంటూ తీవ్ర పోటీ ఉండేది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలై.. అధికారం కోల్పోయేసరకి ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నేతలెవరూ స్వతంత్రంగా, సంతోషంగా ముందుకురాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ఎవరికైనా టికెట్ ఇచ్చినా నామినేషన్ వేసేవరకు పార్టీతోనే ఉంటారన్న నమ్మకమూ లేకుండా పోయింది. పార్టీ తరఫున ప్రకటించిన అభ్యర్థులే కాంగ్రె్‌సలోకి జంప్ అవుతుండడంతో బీఆర్‌ఎస్ నాయకత్వం ఆందోళన చెందుతోంది. ఎంపీ అభ్యర్థులే కాకుండా.. పార్టీ సీనియర్ నేతలు, గతంలో మంత్రులుగా పనిచేసినవారు, సిటింగ్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా కె.కేశవరావు, కడియం శ్రీహరి కూడా పార్టీ మారడం ఖాయమైంది. అయితే వీరు బహిరంగంగా పార్టీ మారుతుండగా.. లోలోపల ఇంతకంటే పెద్ద వ్యవహారమే జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్‌ఎస్ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. రాబోయే కొద్దిరోజుల్లో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారితే చట్టపరంగా ఇబ్బందిలేని సంఖ్యలోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరతారని చెప్పకనే చెబుతున్నారు. తమతో 30 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డితో సహా పలువురు మంత్రులు కూడా చెబుతున్న విషయం తెలిసిందే.
నన్ను పిచ్చోణ్ణి చేశారు
పార్టీలో కీలకం అనుకున్నవారే..
గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా పార్లమెంటు ఎన్నికల వేళ పార్టీని వీడి వెళ్తుండడంపై బీఆర్‌ఎ్‌సలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుతం బీఆర్‌ఎ్‌సలో ఉన్న మిగతా నేతల్లోనూ పార్టీ మారాలనే ఆలోచన మొదలైందని, ఇందుకోసం వారితో టచ్‌లో ఉన్న అధికార పార్టీ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. నిన్నమొన్నటి వరకు ఓవర్‌లోడ్‌తో కిక్కిరిసిపోయిన ‘కారు’ ఇప్పుడు ఇలా క్రమంగా ఖాళీ అవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే గులాబీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి.. చేయి అందుకుంటున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. తాము అన్ని గేట్లు ఎత్తితే బీఆర్‌ఎస్ నాయకులందరూ తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లోపే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి వెళ్లిపోతే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవడం ఆ పార్టీకి కష్టతరంగా మారుతుంది. మరోవైపు పార్టీ మారకుండా ఉన్నవారైనా పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పనిచేస్తారా? అని కూడా బీఆర్‌ఎ్‌సలో చర్చ జరుగుతోంది. కారు సర్వీసింగ్‌కు వెళ్లిందని, సర్వీసింగ్ అయి మళ్లీ బయటకు వస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండగా.. కారు షెడ్డు నుంచి బయటకు వచ్చినా.. అందులో ఎక్కేందుకు ఎవరూ ఉండరని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
భార్యాభర్తల మాటలు వింటారా ?
చివరికి మిగిలింది అవినీతి ఆరోపణలే!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ (అప్పడు టీఆర్‌ఎస్) ఒక వెలుగు వెలిగింది. ఒక దశలో భవిష్యత్తులో కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ దేశ ప్రధానమంత్రి కాబోతున్నారనే ప్రచారాన్ని ఊదరగొట్టింది. అంతేకాదు ‘దేశ్ కీ నేత’ అంటూ కేసీఆర్ పేరును ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజల సొమ్ము (ప్రభుత్వ పథకాల ప్రకటనలతో)తో పత్రికా ప్రకటనలు ఇచ్చారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. ఫలితంగా రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దరిమిలా బీఆర్‌ఎ్‌సలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పదవుల్లో ఉన్నవారే మొదటగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా.. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయ పునరేకీకరణ పేరుతో పార్టీ ఫిరాయింపులను కేసీఆరే ప్రోత్సహించడంతో.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ‘నీవు నేర్పిన విద్యయే కదా’ అంటూ నేతలను పార్టీలోకి చేర్చుకుంటోంది. ఫిరాయింపులను నిలువరించలేక, నేతలకు ధైర్యాన్ని చెప్పలేక బీఆర్‌ఎస్ కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎ్‌సకు చివరికి ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సహా పలు అవినీతి ఆరోపణలే పార్టీకి మిగిలాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి