Share News

Students: ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:10 AM

యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ రెండు వేర్వురు ఘటనలు సోమవారం బాచుపల్లి, పోచారంలలో జరిగాయి.

Students: ఇద్దరు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య

  • బాచుపల్లి, పోచారం..లలో ఘటనలు

  • యాజమాన్యాల ఒత్తిడే కారణమని కుటుంబీకుల ఆరోపణలు

దుండిగల్‌, ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 2(ఆఽంధ్రజ్యోతి): యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ రెండు వేర్వురు ఘటనలు సోమవారం బాచుపల్లి, పోచారంలలో జరిగాయి. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా బోర్గం మండలం చింతాడు గ్రామానికి చెందిన ప్రజ్ఞ(18) ప్రగతినగర్‌ సింహపురికాలనీలోని ఇంపల్స్‌ కళాశాలలో ఎంపీసీ రెండో ఏడాది చదువుతూ అదే కళాశాల వసతిగృహంలో ఉంటోంది. సోమవారం ఉదయం హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో ప్రజ్ఞ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ప్రజ్ఞ తరగతి గదికి రాకపోవడంతో కళాశాల యాజమాన్యం హాస్టల్‌కు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించగా విద్యార్థిని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మరో ఘటనలో బాఽధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం పెద్దపలుగు తండాకు చెందిన బానోత్‌ జగన్నాథం చిన్న కుమారుడు బానోత్‌ తనుష్‌ నాయక్‌(16) అలియాస్‌ టింకు పోచారం మునిసిపాలిటీ అన్నోజిగూడలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం టీ విరామం అనంతరం తనుష్‌ కనిపించ లేదు. తోటి విద్యార్థులు వెతకగా బాత్‌రూంలో బెడ్‌షీట్‌తో ఉరివేసుకొని కనిపించాడు. కళాశాల యాజమాన్యం హుటాహుటిన తను్‌షను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని వచ్చిన మృతుడి బంధువులు కళాశాల లోపలికి వెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు వారిని బయటకు పంపించగా, న్యాయం జరిగే కదిలేది లేదని కళాశాల గేటు ఎదుటే బైఠాయించారు. మృతుడి బంధువు ఒకరు ఒంటిపై కిరోసిన్‌ పోసుకోని ఆత్మహత్యకు యత్నించారు. రెండు ఘటనల్లోనూ తాము రాకముందే మృతదేహాలను ఎలా తరలిస్తారంటూ బాధిత తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు యానమాన్యాల ఒత్తిడే కారణమంటూ విద్యార్థి సంఘాలు రెండు కళాశాలల దగ్గర ఆందోళనలు నిర్వహించాయి.

Updated Date - Dec 03 , 2024 | 04:10 AM