Share News

TG: అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి

ABN , Publish Date - May 13 , 2024 | 05:11 AM

ఉన్నత విద్య కోసం రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లిన ఇద్దరు యువకులు డిగ్రీ పట్టా అందుకున్న వారం రోజులకే అక్కడి ఓ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని అరిజోనా ఫాసిల్‌ క్రీక్‌ జలపాతం వద్ద ఏప్రిల్‌ 8న జరిగిన ఘటనలో ఖమ్మంకు చెందిన లక్కిరెడ్డి రాకేష్‌ రెడ్డి(23), హైదరాబాద్‌కు చెందిన రేపాల రోహిత్‌ మణికంఠ(25) ప్రాణాలు కోల్పోయారు.

TG: అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి

ఖమ్మం, మే 12(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య కోసం రాష్ట్రం నుంచి అమెరికా వెళ్లిన ఇద్దరు యువకులు డిగ్రీ పట్టా అందుకున్న వారం రోజులకే అక్కడి ఓ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని అరిజోనా ఫాసిల్‌ క్రీక్‌ జలపాతం వద్ద ఏప్రిల్‌ 8న జరిగిన ఘటనలో ఖమ్మంకు చెందిన లక్కిరెడ్డి రాకేష్‌ రెడ్డి(23), హైదరాబాద్‌కు చెందిన రేపాల రోహిత్‌ మణికంఠ(25) ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మంలోని మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల డైరెక్టర్లలో ఒకరైన చంద్రశేఖర్‌రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు రాకేష్‌రెడ్డి బీటెక్‌ పూర్తి చేసి ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు.


అక్కడి అరిజోనా వర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేసిన రాకేష్‌రెడ్డి వారం రోజుల క్రితం డిగ్రీ పట్టా కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో రాకేష్‌ రెడ్డి తన స్నేహితులతో కలిసి ఏప్రిల్‌ 8న అరిజోనా ఫాసిల్‌ క్రీక్‌ జలపాతానికి వెళ్లాడు. అక్కడ రోహిత్‌ మణికంఠ, రాకేష్‌ జలపాతంలో మునిగిపోయారు. మరుసటిరోజు వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్‌ రెడ్డి దంపతులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. రోహిత్‌ కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రాకేష్‌ రెడ్డి, మణికంఠ మృతదేహాలను స్వదేశానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Updated Date - May 13 , 2024 | 05:11 AM