Share News

University Vacancies: యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ ఎప్పుడు?

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:06 AM

రాష్ట్రంలో యూనివర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీని ఎప్పుడు చేపడతారనే విషయంలో స్పష్టత రావడం లేదు. యూనివర్సిటీల్లో కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడంతో ప్రొఫెసర్‌ పోస్టులతో పాటు, బోధనేతర పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి.

University Vacancies: యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ ఎప్పుడు?

  • పెండింగ్‌లో నియామక బోర్డు.. ఇప్పటికీ 5 వేలకు పైనే ఖాళీలు

  • అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటేనే ముందడుగు పడే అవకాశం

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యూనివర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీని ఎప్పుడు చేపడతారనే విషయంలో స్పష్టత రావడం లేదు. యూనివర్సిటీల్లో కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడంతో ప్రొఫెసర్‌ పోస్టులతో పాటు, బోధనేతర పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ విషయంలో కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికను ప్రకటించలేదు. ఈ అంశంపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటేనే ముందడుగు పడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం వర్సిటీల్లో భర్తీ చేయాల్సిన పోస్టులు 5వేలకు పైగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.


ఇందులో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి. గతంలో అంచనా వేసిన ప్రకారం 11 వర్సిటీల్లోనే సుమారు 4 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు గుర్తించారు. తర్వాత మరో నాలుగు వర్సిటీలను కూడా ఈ జాబితాలోకి తీసుకురావడంతో ఖాళీ పోస్టుల సంఖ్య మరో వెయ్యిపెరగనుంది. ప్రస్తుతం వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సాంకేతిక సమస్య అడ్డంకిగా మారింది. ఈ పోస్టుల భర్తీ కోసం గత ప్రభు త్వం కామన్‌ నియామక బోర్డును ఏర్పాటు చేసింది. హెల్త్‌ యూనివర్సిటీ మినహా.. మిగిలిన 15 వర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టుల ఖాళీలను ఈ బోర్డు ద్వారా భర్తీ చేసేలా దీన్ని రూపొందించారు.


ఈ బోర్డుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఒక బిల్లును ఆమోదించి గవర్నర్‌ ఆమోదానికి పంపించారు. అయితే.. దీనికి గవర్నర్‌ ఆమోదం లభించలేదు. రాష్ట్రపతి పరిశీలన కోసం ఆ బిల్లును పంపించారు. దాంతో దానిపై ముందుకు వెళ్లలేని, వెనక్కి రాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యల్ని చేపట్టింది. అందులో భాగంగా అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని భావిస్తున్నారు.


ఈ క్రమంలో వర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీ అంశంపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలంటే.. గతంలో ఆమోదించిన నియామక బోర్డు బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అనంతరం మరోసారి బిల్లును ప్రవేశపెట్టి, దానికి చట్టబద్ధతను కల్పించడానికి అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో టీపీఎస్సీ ద్వారా కూడా ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి వీలుంటుందని భావిస్తున్నారు.


  • గతంలో ఇలా...

గతంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను ఆయా వర్సిటీలే భర్తీ చేసుకునే విధానం ఉండేది. వర్సిటీలలోని ప్రత్యేక కమిటీ ద్వారా ఆ ప్రక్రియ జరిగేది. ఎలాంటి రాత పరీక్ష ఉండేది కాదు. అభ్యర్థులకు ఆయా డిగ్రీ చదువుల్లో వచ్చిన మార్కులు, నెట్‌, స్లెట్‌ వంటి పరీక్షల వంటి వాటి వెయిటేజీకి 50ు మార్కు లు, ఇంటర్వ్యూకు మరో 50ు మార్కుల పద్ధతిలో ఈ నియామకాలను చేపట్టేవారు. ఈ విధానంలో నియామకాల్లో నాణ్యత ఉండడం లేదన్న విమర్శల నేపథ్యంలో యూజీసీ సూచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పలు మార్పులను సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీపై విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Jul 27 , 2024 | 04:06 AM