Kishan Reddy: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:47 AM
మనిషి జీవితంలో యోగా ఓ మంచి డాక్టర్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిత్యం యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజాం కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
మనిషి జీవితంలో మంచి డాక్టర్ యోగా: కిషన్ రెడ్డి
యోగాను విశ్వవ్యాప్తం చేసింది మోదీనే : గవర్నర్
హైదరాబాద్, బర్కత్‌పుర, నందిగామ, మేడ్చల్ టౌన్, వికారాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : మనిషి జీవితంలో యోగా ఓ మంచి డాక్టర్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిత్యం యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిజాం కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి సతీ్‌షచంద్ర దూబే, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌తో కలిసి యోగా చేశారు. ఇక, యోగా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. ప్రధాని మోదీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 5వేల మంది అభ్యాసీలతో కలిసి యోగాసనాలు వేశారు. ఇక, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాద్‌లోని తన నివాసంలో యోగా చేశారు. ఇక, పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప వారసత్వం యోగా అని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఈటల పలు ఆసనాలు వేశారు.
ఉపాధి కూలీల యోగా సందడి
కట్టంగూరు, అడవిదేవులపల్లి, జూన్ 21: నల్లగొండ జిల్లా కట్టంగూరు, అడవిదేవులపల్లి మండలాల్లో ఉపాధి కూలీలు పని ప్రదేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. కట్టంగూరు మండలంలోని కల్మెర, ఎరసానిగూడెం, బొల్లేపల్లి గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఎంపీడీవో జ్ఞానప్రకాశ్‌రావు ఆసనాలు వేయించారు. అడవిదేవులపల్లిలో ఎంపీడీవో కరుణాకర్‌రావు ఉపాధి కూలీలతో యోగాసనాలు వేయించారు.