Komatireddy Venkat Reddy: త్వరలో 65వ నంబరు జాతీయ రహదారి విస్తరణ
ABN , Publish Date - Sep 17 , 2024 | 02:39 AM
హైదరాబాద్-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారి ఆరు లేన్ల విస్తరణకు రూ.2వేల కోట్లతో చేపట్టనున్న పనులకు త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
పనులకు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి గడ్కరీ
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి
నల్లగొండ, సెప్టెంబరు 16: హైదరాబాద్-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారి ఆరు లేన్ల విస్తరణకు రూ.2వేల కోట్లతో చేపట్టనున్న పనులకు త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్లగొండను రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రూ.450 కోట్లతో నల్లగొండ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వంటి పనులు జరుగుతున్నాయన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు హౌసింగ్ బోర్డుకు చెందిన 50ఎకరాల స్థలాన్ని సేకరించినట్లు చెప్పారు. మరో 25 ఎకరాల్లో రూ.80కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు.