Share News

Hyderabad: తెలంగాణలో రైతు సంక్షేమ చర్యలు భేష్‌

ABN , Publish Date - Aug 29 , 2024 | 03:36 AM

రైతుల సంక్షేమం కోసం తెలంగాణ చర్యలు బాగున్నాయని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సూర్యప్రతాప్‌ షాహీ కొనియాడారు.

Hyderabad: తెలంగాణలో రైతు సంక్షేమ చర్యలు భేష్‌

  • యూపీ వ్యవసాయ మంత్రి షాహీ.. తుమ్మలతో భేటీ

రైతుల సంక్షేమం కోసం తెలంగాణ చర్యలు బాగున్నాయని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సూర్యప్రతాప్‌ షాహీ కొనియాడారు. యూపీలో తమ రైతులు వాడే వరి విత్తనాలు ఎక్కువ శాతం తెలంగాణ నుంచే వస్తాయని తెలిపారు. అందుకే తమ పర్యటనలో భాగంగా విత్తన కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు.


రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పరిస్థితులపై చర్చించారు. షాహీ మాట్లాడుతూ చెరకు సాగులో యాంత్రీకరణ, చక్కెర కర్మాగారాల ఆధునికీకరణ ద్వారా రైతుల నికర ఆదాయం పెంచామని తెలిపారు. తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగం, రైతులకు ప్రాధాన్యం ఇచ్చామని, రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు కేటాయించామన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగులో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెడతామని తెలిపారు.

Updated Date - Aug 29 , 2024 | 03:36 AM