Uttam : యుద్ధ ప్రాతిపదికన గండ్లకు మరమ్మతు
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:39 AM
రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న కాల్వలు, చెరువులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వారం రోజుల్లో పనులు పూర్తి
కేంద్రం సహకరిస్తుందనే ఆశ
వారు నిధులిచ్చినా.. ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తాం
కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ది నిస్సిగ్గు సమర్థన: మంత్రి ఉత్తమ్
కోదాడ, హుజూర్‌నగర్‌లో
దెబ్బతిన్న కాల్వల పరిశీలన
(కాగిత రామచంద్రాపురం నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి/హుజూర్‌నగర్) : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న కాల్వలు, చెరువులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌లలో దెబ్బతిన్న కాల్వలను ఉత్తమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 773 చోట్ల కాల్వలు, చెరువులు దెబ్బతిన్నాయని.. తాత్కాలిక మరమ్మతులకు రూ.73 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.483 కోట్లు అవసరమని కేంద్రానికి నివేదిక ఇచ్చామని తెలిపారు. కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మరమ్మతులను పూర్తి చేస్తామని వెల్లడించారు.
నీటి పారుదలకు అవసరమైన నిధులను సీఎం కేటాయించారని, వారం రోజుల్లో పనులు పూర్తి చేసి రైతులకు నీరందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వర్షాలతో రూ.10,300 కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక ఇచ్చామని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి పాలేరు జలాశయానికి నీటిని తరలించే సాగర్ ఎడమకాల్వకు కాగిత రామచంద్రాపురం వద్ద పడిన గండిని పూడ్చేందుకు రేయింబవళ్లు పని చేయాలని అధికారులను ఆదేశించారు. కోదాడలోని రెడ్ల కుంట ప్రధాన కాల్వ గండికి రెండు మూడు రోజుల్లో మరమ్మతులు చేయాలని సూచించారు. హుజూర్‌నగర్‌లోని ముక్త్యాల ప్రధాన కాల్వ కింద 1.07 లక్షల ఎకరాలకు నీరందాల్సి ఉందని, ఫ్లడ్ లైట్ల వెలుగులో వారం రోజుల్లో గండిని పూడ్చాలని ఆదేశించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వ యంత్రాంగం వరద సహాయక చర్యల్లో ఇంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవని ఉత్తమ్ అన్నారు. వరదలు వచ్చిన గంటలోపే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు సహాయక చర్యల్లో ఉన్నారని తెలిపారు.
ఐదు సీఈల పరిధిలోనే భారీ నష్టం..
వర్షాలతో ఐదు చీఫ్ ఇంజనీర్ల పరిధిలోనే భారీగా నష్టం జరిగిందని మంత్రి వెల్లడించారు. సీఈ వరంగల్ పరిధిలో 67 చోట్ల చెరువులు/కాలువలు/మత్తడి/స్లూయి్‌సలు దెబ్బతినగా, 75 చోట్ల గండ్లు పడ్డాయని.. సీఈ ఖమ్మం పరిధిలో 106 చోట్ల, సీఈ ములుగు పరిధిలో 91 చోట్ల, సీఈ ఆదిలాబాద్ పరిధిలో 60 చోట్ల, సీఈ సూర్యాపేట పరిధిలో 49 చోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్‌హౌస్, ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు పంప్‌హౌస్ దెబ్బతిన్నాయని తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయాలు..
ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగితే.. దాని ద్వారా కొంత మంది లబ్ధి పొందే ప్రయత్నం చేయాలనుకుంటున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ.97 వేల కోట్లు వెచ్చించి.. 98 వేల ఎకరాలకే నీళ్లిచ్చారని విమర్శించారు. కాళేశ్వరం పథకం డిజైన్ చేసింది, కట్టింది.. బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని.. అది కూలింది కూడా వారి హయాంలోనేనని పేర్కొన్నారు. సిగ్గులేకుండా కాళేశ్వరం పథకాన్ని సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. రూ.27 వేల కోట్లు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో వెచ్చిస్తే.. ఒక్క ఎకరం కూడా తడవలేదని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దశలవారీగా పూర్తి చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పదేళ్లలో పూర్తి చేయలేదని.. 2025 డిసెంబర్ కల్లా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఉత్తమ్ తెలిపారు.