Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఈ దఫాలోనే పూర్తి
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:57 AM
తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోపే (ప్రస్తుత టర్మ్‌లోనే) శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ను పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
ఏకకాలంలో ఇరువైపులా టన్నెలింగ్ పనులు.. గ్రావిటీతో 3 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు
రాజకీయ దురుద్దేశంతోనే గత ప్రభుత్వం బ్రాహ్మణవెల్లెంల రిజర్వాయర్‌ను పక్కనపెట్టింది
దానిని పూర్తి చేశాం: మంత్రి ఉత్తమ్
నాకు తోటలు, ఫాంహౌ్‌సలు లేవు.. పుట్టిన నేల కోసమే ప్రాజెక్టు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నేడు బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతలను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
(బ్రాహ్మణవెల్లెంల నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తమ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోపే (ప్రస్తుత టర్మ్‌లోనే) శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ను పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రెండువైపులా టన్నెలింగ్ పనులు ఏకకాలంలో చేపడతామని, టన్నెల్ పూర్తిచేసి, గ్రావిటీతో 3 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందిస్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రాజకీయ దురుద్దేశంతో పక్కనపెట్టిన, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఈ టర్మ్‌లో పూర్తి చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. మంచిరోజులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. ఉదయసముద్రం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన బ్రాహ్మణవెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నల్లగొండ మెడికల్ కాలేజీ, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండో దశను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉత్తమ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని దశాబ్దకాలంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తులు చేసినప్పటికీ.. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం చూపిందన్నారు. ఉదయసముద్రం నుంచి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులో భాగంలో కట్టిన బ్రాహ్మణవెల్లెంల నుంచి 50 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. దీని కింద మరో 730 ఎకరాలు సేకరించాల్సి ఉందని, వారం రోజుల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన న్నారు.
భూమి ధర పెరిగింది
బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులో నీటిని నింపుతుండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి, ఎకరా రూ.10 లక్షలు పలికే భూమి రూ.77 లక్షలకు అమ్ముడుపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీకి, తనకు ఎక్కడ పేరు వస్తుందో అనే కారణంతోనే ప్రాజెక్టు పనులు పక్కన పెట్టారన్నారు. బ్రాహ్మణవెల్లెంలలో తనకు 3 ఎకరాల భూమి మాత్రమే ఉందని.. తోటలు, ఫామ్‌హౌ్‌సలు లేవన్నారు. గతంలో ఒక రైతు 26 బోర్లు 1500 ఫీట్ల లోపల వేసినా నీళ్లు పడలేదని, ఇది ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతమని గుర్తు చేశారు. పుట్టిన ఊరు, మండలానికి మేలు చేయాలనే ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు.
నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్
బ్రాహ్మణవెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. దీంతో రెండు దశాబ్దాల కల సాకారం కానుంది. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించడమే లక్ష్యంగా 2005 ఆగస్టులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. 2007లో రూ.699 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. 6.70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి... నార్కట్‌పల్లి, నల్గొండ, చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం, కట్టంగూరు, నకిరేకల్, తుంగతుర్తిలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా నిర్మాణం చేశారు. 2015, 2021లో ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని సవరించారు. ఇప్పటిదాకా రూ.469.95 కోట్లను వెచ్చించారు. మరో రూ.204.72 కోట్ల పనులు జరగాల్సి ఉంది. ఉదయ సముద్రం ప్రాజెక్టులో భాగంగానే 0.302 టీఎంసీల సామర్థ్యంతో బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించారు. హెడ్‌వర్క్‌లతో పాటు అప్రోచ్ చానల్, ప్రెషర్ మెయిన్ పనులు పూర్తయ్యాయి. ఈ రిజర్వాయర్ కింద ఎడమ ప్రధాన కాలువ కింద 43 వేల ఎకరాలు, కుడి ప్రధాన కాలువ కింద 57 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. తొలిదశలో మునుగోడు కింద 2,908 ఎకరాలు, నల్గొండ నియోజకవర్గంలో 22,750 ఎకరాలు, నకిరేకల్‌లో 23 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.
హుజూర్‌నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హుజూర్‌నగర్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారిబంగ్లా గెస్ట్‌హౌస్, సబ్ డివిజనల్ కార్యాలయాలకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిందని, రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని వారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.