Share News

VH Hanumanthu Rao : దేశ చరిత్రను వక్రీకరించే పనిలో బీజేపీ

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:08 AM

దేశ స్వాతంత్య్ర పోరాటంలో, హైదరాబాద్‌ విలీనంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, దేశ చరిత్రనే బీజేపీ తారుమారు చేసే స్థితిలో ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రె స్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు.

VH Hanumanthu Rao : దేశ చరిత్రను వక్రీకరించే పనిలో బీజేపీ

  • హైదరాబాద్‌ విలీనంలో బీజేపీకి

  • ఏ సంబంధమూ లేదు: వీహెచ్‌

  • వల్లాలలో అమరవీరుల స్మారక స్థూపం శంకుస్థాపన

శాలిగౌరారం, సెప్టెంబరు 17: దేశ స్వాతంత్య్ర పోరాటంలో, హైదరాబాద్‌ విలీనంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, దేశ చరిత్రనే బీజేపీ తారుమారు చేసే స్థితిలో ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రె స్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన 10మంది విద్యార్థులు ప్రాణాలొదిలారు. అక్కడ తాజాగా అమరవీరుల స్మారక స్తూపం నిర్మాణానికి మంగళవారం వీహెచ్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ విలీన దినం సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీకి హైదరాబాద్‌ విలీనంలో ఎటువంటి పాత్రా లేదని, వారు కాంగ్రెస్‌కు నీతు లు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రబిందువన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నాటి హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ను అన్ని సంస్థానాలను భారత్‌లో అంతర్భాగం చేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఈ మేరకు నిజాం పన్నాగాలను పటేల్‌ బద్దలు కొట్టారని, నలువైపులా భారతదేశ బలగాలను దింపి నిజాం లొంగిపోయేలా చేశారన్నారు. 1948 సెప్టెంబరు 17న నిజాం లొంగిపోవడంతో హైదరాబాద్‌ భారత యూనియన్‌లో విలీనమైందని, ఇందులో బీజేపీ కి ఎటువంటి సంబంధం లేదన్నారు. సాయుధ పోరాటంలో అమరులైన విద్యార్థులను స్మరించుకోవాలని, రానున్న తరాలకు దేశభక్తి నేర్పాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తుంగతుర్తి, నకిరేకల్‌ ఎమ్మెల్యే లు మందుల సామేలు, వేముల వీరేశం మాట్లాడుతూ.. వల్లాలలో అమరులైన విద్యార్థుల చరిత్రను తెలుసుకుని ఇక్కడికి వచ్చి అమరుల స్తూప నిర్మాణానికి వీహెచ్‌ నడుం బిగించడం అభినందనీయమన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 04:08 AM