Khammam: కొణిజర్లలో ఎస్‌ఏఆర్ రైస్ మిల్లుపై కేసు..
ABN , Publish Date - Sep 27 , 2024 | 02:53 AM
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైస్ మిల్లులపై పౌర సరఫరాల అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
రూ.81 కోట్ల ధాన్యం మాయమైందని ఫిర్యాదు
పెనుబల్లిలో కేపీఆర్ మిల్లుపై విజిలెన్స్ దాడి
రూ.2 కోట్ల బకాయిలు చెల్లించాలని హెచ్చరిక
కొణిజర్ల/పెనుబల్లి, సెప్టెంబరు 26: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు రైస్ మిల్లులపై పౌర సరఫరాల అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను ప్రభుత్వానికి ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టించినందుకు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం సమీపంలోని ఎస్‌ఏఆర్ రైస్ మిల్లు యజమానిపై పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గంటా శ్రీలత కొణిజర్ల పొలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం మిల్లు యజమాని రమాజ్యోతిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఎస్‌ఏఆర్ రైస్ మిల్లుకు ప్రభుత్వం 2022-23, 2023-24 రబీ, ఖరీప్ సీజన్లకుగాను 3,50,622 క్వింటాళ్ల ధాన్యాన్ని సరఫరా చేయగా.. మిల్లు వారు 99,122.68 క్వింటాళ్లు మాత్రమే మర ఆడించి ప్రభుత్వానికి పంపించారు.
దాంతో టాస్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీలు నిర్వహించి 2,51,499 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేల్చారు. దీని విలువ సుమారు 81,60,90,000 ఉంటుందని మిల్లు యజమానిపై సవిల్ సప్లైస్ డీఎం శ్రీలత పొలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన నగదు చెల్లించకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో గురువారం విజిలెన్స్ అధికారులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని కేపీఆర్ రైస్‌మిల్లుపై దాడి చేశారు.
టేకులపల్లిలోని కేపీఆర్ రైస్‌మిల్లు గత ఏడాది రబీ వేలంలో రూ.2.85 కోట్లకు ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటి దాకా ప్రభుత్వానికి రూ.65 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగిలిన నగదును చెల్లించాలని నోటీసులు పంపించినా స్పందించటం లేదని జిల్లా అధికారులు సంబంధిత శాఖ అధికారులకు నివేదిక అందజేశారు. రైస్‌మిల్లు యజమాని నుంచి రికవరీ కోసం విజిలెన్స్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ప్రభుత్వానికి వెంటనే నగదును చెల్లించాలని, లేకుంటే మిల్లును బ్లాక్ లిస్టులో పెట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు సివిల్ సప్లైస్ విజిలెన్స్ అధికారులు తెలిపారు.