Ramoji Film City: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. వెస్టెక్స్ ఏషియా కంపెనీ సీఈఓ మృతి
ABN , Publish Date - Jan 20 , 2024 | 09:15 AM
రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన వెస్టెక్స్ ఏషియా కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సదరు కంపెనీ సీఈవో మృతి చెందగా, కంపెనీ ప్రెసిడెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన వెస్టెక్స్ ఏషియా కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సదరు కంపెనీ సీఈవో మృతి చెందగా, కంపెనీ ప్రెసిడెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన సంజయ్ షా(56) చికాగోలో స్థిరపడ్డారు. ఆయనకు విస్టెక్స్ ఏషియా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. కంపెనీ ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామోజీఫిల్మ్ సిటీలోని లైమ్-లైట్ గార్డెన్ వేదికగా గురు, శుక్ర వారాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి 7 గంటలకు ఈ వేడుక ప్రారంభమైంది. కంపెనీ సీఈవో సంజయ్‌షాతోపాటు ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజ్‌దాట్ల ఏరియల్ యాక్ట్ ద్వారా స్టేజీ మీదకు వచ్చేలా ఈవెంట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఏరియల్ యాక్ట్ ద్వారా వారిద్దరూ స్టేజీ మీదకు దిగే క్రమంలో ఒక వైపున ఉన్న ఐరన్ తీగలు తెగిపోయాయి. దీంతో సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి వారిద్దరూ కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ తొలుత సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ సంజయ్‌షా గురువారం అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కంపెనీ ప్రెసిడెంట్ విశ్వనాథ్‌రాజ్ దాట్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.