Share News

Rain Alert: వరంగల్ జిల్లాలో వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

ABN , Publish Date - Sep 01 , 2024 | 07:20 AM

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏటూరునాగారం-వరంగల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.

Rain Alert: వరంగల్ జిల్లాలో వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal Dist.,)లో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏటూరునాగారం-వరంగల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో వరదనీరు ఇళ్లలోకి చేరింది. దీంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగుతున్నాయి. పలు చెరువులు మత్తడి పోస్తున్నాయి. అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.


పంట పొలాలు నీటమునగగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కల్వర్టులు, రహదారులపై నుంచి వరద పోటెత్తడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్‌ జిల్లాలో సగటు వర్షపాతం 5.96 సెంటీమీటర్లు కాగా, అత్యధికంగా నెక్కొండ మండలంలో 10.17సెంటీ మీటర్లుగా నమోదైంది. భారీ వర్షానికి చెన్నారావుపేటలో కట్టమ్మకు చెందిన పెంకుటిల్లు కూలిపోయింది. జల్లి గ్రామంలో రేకులషెడ్‌ పైకప్పు ధ్వంసమైంది. ఖానాపురం మండలం నాజీతండా శివారులోని వాగు ఉప్పొంగడంతో శనివారం రెండుగంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పంచాయతీ కార్యదర్శి బాలు, ఎస్ఐ రఘుపతి జేసీబీతో వాగులోని చెట్లకొమ్మలు తొలగించారు. కొంతసేపు గుంజేడుకు వెళ్లేవారిని జాతీయ రహదారి మీదుగా పంపారు.


పెద్దవంగర మండలంలోని విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. ములుగు జిల్లా ములుగు మండలంలోని సర్వాపురం-జగ్గన్నగూడెం గ్రామాల మధ్యలో బొగ్గులవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జగ్గన్నగూడెం, సర్వాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏటూరునాగారం మండలంలో పిడుగుపాటుకు పలు ఇండ్లలోని రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఫ్యాన్లు కాలిపోయాయి. దొడ్ల, ఎలిశెట్టిపల్లి సమీపంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మంగపేట మం డలం మంగపేట-బోరునర్సాపురం గ్రామాల మధ్య గౌరారం వాగు ఉధృతి బోరునర్సాపురం తీరం వైపునకు మళ్లడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.


కంట్రోల్‌ రూంల ఏర్పాటు

వరంగల్‌ కలెక్టరేట్, నర్సంపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. వరంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో, కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్వో తెలిపారు. వరంగల్‌ మండల పరిధిలోని ముంపు ప్రాంతాలు ఎనుమాముల, బాలాజీనగర్, చాకలి ఐలమ్మనగర్, హంటర్‌రోడ్డు ప్రాంతంలోని సాయినగర్, ఎన్టీఆర్‌ నగర్‌ లోతట్టు ప్రజలు 70136 26828 సంప్రదించాలన్నారు. నర్సంపేట పట్టణ ప్రజలు 91213 06007 సంప్రదించాలని కమిషనర్‌ సూచించారు.


తాడ్వాయి మండ లం మేడారంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు మళ్లీ మత్తడి పోస్తున్నది. వెంకటాపురం(నూగూరు) మండలం మొర్రవానిగూడెం గ్రామానికి చెందిన మల్లమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి, శంకరంపల్లి, బొప్పారం, దామెరకుంట తదితర గ్రామాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. గోపాల్‌పూర్‌ గ్రామంలో దుర్గం రాజు ఇల్లు ధ్వంసమైంది. హనుమకొండ, జనగామ జిల్లాలో మోస్తరుగా వర్షం కురిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ నెలంతా వానలు?

వణికించిన చినుకు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 01 , 2024 | 07:20 AM