Share News

TG: నా కనుగుడ్లు పీకేస్తా..పేగులు మెడలో వేసుకుంటానన్న రేవంత్‌ పై ఎందుకు నిషేధం పెట్టలే?

ABN , Publish Date - May 02 , 2024 | 05:20 AM

నేను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధం విధించిన భారత ఎన్నికల సంఘం, నా పేగులు మెడలో వేసుకుంటా.. కనుగుండ్లు పీకుతానన్న రేవంత్‌ రెడ్డిపై ఎందుకు నిషేధం విధించలేదు?’

TG: నా కనుగుడ్లు పీకేస్తా..పేగులు మెడలో వేసుకుంటానన్న రేవంత్‌ పై ఎందుకు నిషేధం పెట్టలే?

  • ఉచిత బస్సు పథకం మంచిదే..

  • కానీ ఆటోవాలాల పొట్ట కొట్టింది

  • ఈ దుష్టపాలనలో రైతులు చస్తున్నరు: కేసీఆర్‌

  • మానుకోటలో బస్సుయాత్ర, కార్నర్‌ మీటింగ్‌

  • రాత్రి 7:20 నుంచి 14 నిమిషాల ప్రసంగం

మహబూబాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ‘నేను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధం విధించిన భారత ఎన్నికల సంఘం, నా పేగులు మెడలో వేసుకుంటా.. కనుగుండ్లు పీకుతానన్న రేవంత్‌ రెడ్డిపై ఎందుకు నిషేధం విధించలేదు?’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. తన ప్రచారంపై 48 గంటల నిషేధం విధించినా పార్టీ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని చెప్పారు.


కాంగ్రె్‌సది దుష్టపరిపాలన అని, ఈ పాలనలో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని ఓ కొనుగోలు కేంద్రంలో వడ్లు కొనడం లేదనే ఆవేదనతో ఓ రైతు గుండె ఆగి మృతి చెందాడని చెప్పారు. ఉచిత బస్సు పథకం మంచిదే అయినప్పటికీ ఆ పథకం, ఆటోవాలాల పొట్ట కొట్టిందని.. వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ఆటోవాలాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగిలిన గ్యారెంటీల్లో ఏదీ అమలవడం లేదని పేర్కొన్నారు. బుధవారం మహబూబాబాద్‌లో కేసీఆర్‌ బస్సుయాత్ర, కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. రాత్రి 7.10కు మానుకోట జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ సెంటర్‌కు ఆయన చేరుకున్నారు. కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ నిషేధం విధించిన నేపథ్యంలో ఆయన రాత్రి 7:20 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించారు. 14 నిమిషాల పాటు ప్రసంగించారు. మారుమూల గిరిజన ప్రాంతం కావడంతో అభివృద్ధి చేసేందుకు మహబూబాబాద్‌ను జిల్లాగా తాను ఏర్పాటు చేస్తే, ఈ జిల్లాను రేవంత్‌ రెడ్డి రద్దు చేస్తానని అంటున్నారని ఆరోపించారు.


జిల్లాగా మహబూబాబాద్‌ ఉండాలా? పోవాలా? అని ప్రజలను ప్రశ్నించారు. రేవంత్‌ మెడలు వంచాంటే మహబూబాబాద్‌ నుంచి మాలోతు కవితను గెలిపించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం గోదావరి నీళ్లను తీసుకుపోతుందని, అయినా రేవంత్‌రెడ్డి మౌనంగా ఉన్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని గుర్తుచేశారు.

మరి.. ఆ డబ్బు ఖాతాలో పడిందా? వరి పంటపై రూ.500 బోన్‌సగా వచ్చిందా? అని ప్రశ్నించారు. కాగా మంగళవారం రాత్రి కొత్తగూడెం కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్న అనంతరం కేసీఆర్‌, అక్కడి సింగరేణి అతిథి గృహంలో బస చేశారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ నేత వనమా వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం కోసం చురుగ్గా పనిచేయాలని వనమాను కేసీఆర్‌ కోరారు.

Updated Date - May 02 , 2024 | 05:20 AM