Medaram Forest: మేడారం అడవుల్లో అద్భుతం.. ఆ విధ్వంసాన్ని ముందే పసిగట్టాయా..
ABN , Publish Date - Sep 19 , 2024 | 05:45 PM
ఇంత పెద్ద విధ్వంసం చోటు చేసుకున్నా.. భారీ వృక్షాలు నేలకొరిగినా.. అక్కడి జంతువులకు, పక్షులకు హానీ జరిగినట్లు ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఇంత పెద్ద విపత్తులోనూ ఒక్క జంతువు గానీ, ఒక్క పక్షి గానీ గాయపడినట్లు, చనిపోయినట్లు వెలుగుచూడలేదని..
ములుగు, సెప్టెంబర్ 18: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఇటీవల వేలాది చెట్లు నేలకొరిగాయి. ఎన్నో వేల సంవత్సరాల నాటి చెట్లు కూడా కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. దాదాపు 500 ఎకరాల్లో 50 వేలకు పైగా చెట్లు ధ్వంసం అయ్యాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా గాలులు విరుచుకుపడ్డాయని.. టోర్నడో వంటి గాలుల కారణంగా చెట్లన్నీ ధ్వంసమైనట్లు చెబుతున్నారు. ఆగస్టు 31 సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య.. అంటే రెండు గంటల వ్యవధిలోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది. కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం కోనెపల్లి వరకు చెట్లన్నీ నేలకూలాయి. ఈ విధ్వంసంలో అడవిలో ఉండే అరుదైన వృక్షాలు కూడా విరిగిపోయాయి. జువ్వి, నారెప, నల్లమద్ది, తెల్లమద్ది, మారేడు, ఇప్ప వంటి చెట్లు ధ్వంసమయ్యాయి.
విధ్వంసాన్ని ముందే పసిగట్టి..
ఇంత పెద్ద విధ్వంసం చోటు చేసుకున్నా.. భారీ వృక్షాలు నేలకొరిగినా.. అక్కడి జంతువులకు, పక్షులకు హానీ జరిగినట్లు ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఇంత పెద్ద విపత్తులోనూ ఒక్క జంతువు గానీ, ఒక్క పక్షి గానీ గాయపడినట్లు, చనిపోయినట్లు వెలుగుచూడలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో చాలా జంతువులు, పక్షులు ఉంటాయి. జింకలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు, అడవి దున్నలు, కొండ గొర్రెలు, అడవిపందులు, కోతులు సహా వివిధ రకాల జంతువులు, పక్షులు ఉంటున్నాయి. వీటిలో ఏ ఒక్కటి కూడా గాయపడినట్లు, చనిపోయినట్లు ఆనవాళ్లు లేవని అటవీశాఖ అధికారులు చెప్పారు.
వణ్య ప్రాణులకు ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టే గుణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వాసన, శబ్ధాలను త్వరగా గుర్తిస్తాయంటున్నారు. భూ ప్రకంపనలు పసిగడతాయని చెబుతున్నారు. మరి ఆగష్టు 31న సాయంత్రం సంభవించిన విధ్వంసాన్ని కూడా ఈ వన్య ప్రాణులు ముందే పసిగట్టాయని.. అలా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయని అధికారులు భావిస్తున్నారు. మరి జంతువులు, పక్షులు ఎక్కడికి వెళ్లాయనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రకృతి సృష్టించిన బీభత్సంలో కూలిన చెట్లను అటవీశాఖ అధికారులు లెక్కిస్తున్నారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొనసాగుతోంది. పడిపోయిన, విరిగిన చెట్ల కొలతలు తీసుకుంటున్నారు అధికారులు. విరిగిన చెట్లకు సర్వే నెంబర్లు కేటాయిస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో విరిగిపడిన చెట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు.