Hyderabad: ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియో పెట్టి..
ABN , Publish Date - Nov 16 , 2024 | 04:31 AM
ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఆ జంట మధ్య పొరపొచ్చాలొచ్చాయి పరస్పరం గొడవపడ్డారు. ఇంట్లో నుంచి వెళ్లిన భర్త తాను చనిపోతున్నానని, తన చావుకు భార్యే కారణమంటూ సెల్పీ వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.
భర్త అదృశ్యం.. భార్య ఆత్మహత్య
5 నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం
గజ్వేల్, నవంబరు 15(ఆంధ్ర జ్యోతి): ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఆ జంట మధ్య పొరపొచ్చాలొచ్చాయి పరస్పరం గొడవపడ్డారు. ఇంట్లో నుంచి వెళ్లిన భర్త తాను చనిపోతున్నానని, తన చావుకు భార్యే కారణమంటూ సెల్పీ వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఇది చూసిన ఆ భార్య.. తన భర్త చనిపోలేదని.. ఇంటికి వస్తాడని ఎదురు చూసి చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గజ్వేల్ సీఐ సైదా కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మాదారం గ్రామానికి చెందిన రేణుక(22), అదే మండలం మైలారం గ్రామానికి చెందిన భాను(24) ప్రేమించుకుని ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఆయా గ్రామాల పెద్దలు ఇద్దరినీ విడదీశారు.
రేణుక ఫిర్యాదు మేరకు పెద్దలపై కేసు నమోదు చేయడంతో మళ్లీ పెద్దలే మధ్యవర్తిత్వం వహించి, ఇద్దరినీ కలిపారు. భార్యాభర్తలు గజ్వేల్‌లో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. అయితే, వారి మధ్య గొడవలు జరిగేవి. సోమవారం కూడా ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగగా, రేణుక స్వగ్రామానికి వెళ్లిపోయింది. కాగా భాను తాను చనిపోతున్నానని, తన చావుకు తన భార్య రేణుక కారణమని సెల్ఫీ వీడియో వాట్సాప్ స్టేట్‌సలో పెట్టి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. ఈ క్రమంలో తన భర్త తనకు కావాలని రేణుక మైలారం గ్రామంలోని భాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. తన భర్త చనిపోడని, రాత్రి ఇంటికి వస్తాడని గజ్వేల్‌లో అద్దెకు ఉంటున్న ఇంటికి గురువారం చేరుకుంది. శుక్రవారం ఉదయం వరకు వేచి చూసిన రేణుక భర్త రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకుంది. రేణుక తల్లిదండ్రులు ఇంటికి వచ్చి తలుపులు తట్టగా, ఎంతకీ తెరవకపోవడంతో కిటికీలోంచి చూశారు. ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో రేణుక కనిపించింది. పోలీసులొచ్చి మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.