Share News

Mahabubnagar: కన్నవారికి నిజం తెలిసేలోపు చచ్చిపోవాలని..

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:40 AM

కన్నవారికి ఎప్పటికప్పుడు అబద్ధం చెబుతూ వచ్చాడు కానీ, వారికి నిజం తెలిసే సమయం దగ్గరపడుతుండటంతో కంగారుపడిపోయాడు. నిజం తెలిసిపోతే తన పరిస్థితి ఏమిటనే భయంతో తీవ్ర ఆందోళన చెందాడు.

Mahabubnagar: కన్నవారికి నిజం తెలిసేలోపు చచ్చిపోవాలని..

  • పాలమూరు జిల్లాలో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

  • బ్యాక్‌లాగ్స్‌ఉన్నా పాస్‌ అయ్యానంటూకన్నవారితో అబద్ధం

  • విదేశాలకు పంపేందుకు తల్లిదండ్రుల ఏర్పాట్లు

  • నిజం తెలిస్తే ఏం జరుగుతుందోనని బలవన్మరణం

రాజాపూర్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కన్నవారికి ఎప్పటికప్పుడు అబద్ధం చెబుతూ వచ్చాడు కానీ, వారికి నిజం తెలిసే సమయం దగ్గరపడుతుండటంతో కంగారుపడిపోయాడు. నిజం తెలిసిపోతే తన పరిస్థితి ఏమిటనే భయంతో తీవ్ర ఆందోళన చెందాడు. చివరికి డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండల కేంద్రంలో ఈ విషాదం జరిగింది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజాపూర్‌లోని మీ సేవ కేంద్రం నిర్వాహకుడు సున్నపు రాధాకృష్ణ కుమారుడు సుభాష్‌(22) హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో బీటెక్‌ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. సుభాష్‌ ఏటా అన్ని పరీక్షలలోనూ పాస్‌ అయ్యానంటూ తల్లిదండ్రులకు చెబుతూ వస్తున్నాడు.


కుమారుడు బ్రహ్మాండంగా చదువుతున్నాడనే భావనలో ఉన్న తల్లిదండ్రులు అతడిని ఎంటెక్‌ కోసం విదేశాలకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది తెలిసిన సుభాష్‌.. తానైతే పరీక్షల విషయంలో అబద్ధం చెప్పానని... ఒకవేళ తల్లిదండ్రులకు తాను ఫెయిల్‌ అయ్యానట్లు, బ్యాక్‌లాగ్స్‌ ఉన్నట్లు తెలిస్తే ఏమంటారోనని కొన్నాళ్లుగా ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయట నుంచి వచ్చిన తల్లిదండ్రులు, కుమారుడు ఉరితాడుకు వేలాడుతున్న స్థితిలో విగతజీవిగా కనిపించడంతో భోరున విలపించారు. అయితే ఈ ఘటన గురించి తమకెలాంటి సమాచారం లేదని రాజాపూర్‌ ఎస్సై రవి వెల్లడించారు.

Updated Date - Dec 17 , 2024 | 05:40 AM