Medak: యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ లైన్‌మెన్ నిర్లక్ష్యం..
ABN , Publish Date - Jul 07 , 2024 | 05:16 AM
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అర్కెలలో జూనియర్ లైన్‌మెన్ నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు.
తనకు బదులుగా విధులు అప్పగింత
విద్యుత్ స్తంభం పైనుంచి పడి మృత్యువాత
పాపన్నపేట, జూలై 6: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అర్కెలలో జూనియర్ లైన్‌మెన్ నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం పోసానిపల్లి గ్రామానికి చెందిన మన్నె మహేశ్ (32) పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన లంగడి సునీతను వివాహం చేసుకుని అక్కడే జీవిస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం. అదే గ్రామంలో పనిచేస్తున్న జేఎల్‌ఎం తనకు బినామీ ఉద్యోగిగా మహేశ్‌ను పెట్టుకున్నాడు. నెలకు రూ. 4 వేలు ఇస్తూ తన పరిధిలో ఎక్కడ విద్యుత్ స్తంభం ఎక్కాల్సి వచ్చినా మహేశ్‌ను వినియోగించుకునేవాడు.
ఈ క్రమంలో శనివారం అర్కెలలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేయాల్సి రావడంతో జేఎల్‌ఎం.. మహేశ్‌కు పని అప్పగించి వెళ్లిపోయాడు. అతడి ఆదేశం మేరకు మహేశ్ 11 కేవీ లైన్‌కు ఎల్‌సీ తీసుకుని విద్యుత్ స్తంభం పైకెక్కి మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న హై టెన్షన్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. దాంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.