Year Ender 2024: ఈ ఏడాది బిగ్ షాక్‌తో మలుపు తిరిగిన జానీ మాస్టర్ కెరీర్
ABN , Publish Date - Dec 19 , 2024 | 10:00 AM
ఈ ఏడాది టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్‌షాకే తలిగిందని చెప్పుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్‌పై లైంగిక వేధింపుల పాల్పడ్డారంటూ జానీపై కేసు నమోదు అవడం.. జైలుకు వెళ్లడం.. ఆపై బెయిల్‌పై బయటకు రావడం ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమే..
2024లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉదంతం ఒకటి. తెలుగులో బడా హీరోలకు కొరియోగ్రఫీ చేస్తూ ఓ వెలుగువెలిగిన జానీ మాస్టర్... ఓ అమ్మాయిపై లైంగిక దాడి కేసులో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. టాలీవుడ్‌లో మంచి ఫాంలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. స్టార్ హీరోల సాంగ్స్‌కు జానీమాస్టర్ చేసే కొరియోగ్రఫీ యువతను ఎంతో ఆకట్టుకుంటుంది. అయితే టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో వెలుగొందుతున్న జానీమాస్టర్... ఓ సంఘటనతో కటకటాలపాలు కావాల్సి వచ్చింది. తన వద్ద పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీమాస్టర్ జైలుకు వెళ్లారు. ఈ మధ్యనే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు కూడా.
అసలేం జరిగిందంటే
సెప్టెంబర్ 15న జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని 21 ఏళ్ల అసిస్టెంట్ మహిళా కొరయోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో జానీమాస్టర్‌పై పోలీసులు లైంగిక వేధింపులు, ఫోక్సో చట్టం కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. సెప్టెంబర్15న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్ కాగా, అదే రోజున నార్సింగ్ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది.
గోవాలో అరెస్ట్...
2017లో ఓ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం రావడంతో బాధితురాలు హైదరాబాద్‌కు వచ్చారు. 2019, డిసెంబర్ 15 నుంచి జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఆ ఏడాదే ఓ ప్రముఖ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో అక్కడ హోటల్ గదిలో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఉద్యోగంలో నుంచి తీసేస్తానని, సినిమాల్లో ఎక్కడా పని దొరకకుండా చేస్తానని బెదిరించినట్లు కూడా బాధితురాలు తెలిపింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని అనేమార్లు వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ భార్య కూడా తనపై చేయి చేసుకున్నట్లు మరో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు సెప్టెంబర్ 18న గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా.. జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అలాగే జానీ మాస్టర్‌ను నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి నాలుగు రోజులు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
సంచలన విషయాలు...
అయితే కస్టడీలో జానీ మాస్టర్ సంచలన విషయాలు తెలిపారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి అబద్ధమన్నారు. తన టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానని తెలిపారు. పైగా తననే బాధితురాలు పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేసేదంటూ కస్టడీలో జానీ మాస్టర్ తెలిపారు. అలాగే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ భార్య కూడా ఎఫ్‌ఎన్‌సీసీలో ఫిర్యాదు చేసింది. దీనిపై ఫిలింఛాంబర్ కూడా విచారణ జరిపింది.
అవార్డు వెనక్కి...
అత్యాచారం కేసు నేపథ్యంలో జానీమాస్టర్‌కు జాతీయ అవార్డును కూడా నిలిపివేశారు. జానీ మాస్టర్‌కు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును కేంద్రం ప్రకటించింది. అయితే లైంగిక వేధింపుల నేపథ్యంలో అవార్డును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అవార్డును తీసుకునేందుకు కోర్టు ఆయనకు నాలుగు రోజుల పాటు అక్టోబర్ 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గడువు ముగియడంతో.. తిరిగి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. మరోవైపు లైంగిక వేధింపుల కారణంగా పార్టీలో సభ్యుడిగా ఉన్న ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. అలాగే మా అసోసియేషన్ కూడా ఆయననై సస్పెన్షన్ వేటు వేయడం జానీ మాస్టర్‌కు పెద్ద షాకే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లైగింక వేధింపుల నేపథ్యంలో కొరియోగ్రఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి కూడా జానీమాస్టర్‌ను తొలగించేశారు. మరోవైపు జానీ మాస్టర్‌పై మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు నమోదు అయ్యింది.
విడుదల
చివరగా.. మరోసారి రెగ్యులర్ బెయిల్ కోసం జానీ మాస్టర్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. అక్టోబర్ 24 న బెయిల్ మంజూరు అయ్యింది. దాదాపు 36 రోజుల పాటు చంచల్ గూడ జైలులోనే ఉన్న జానీమాస్టర్ బెయిల్ రావడంతో చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
మరిన్ని Year Ender -2024 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఇవి కూడా చదవండి...
Read Latest Telangana News And Telugu News