TTD Announces : 7 లక్షల మందికి వైకుంఠద్వార దర్శనం
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:34 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 7లక్షల మందికి ఈ నెల 10 నుంచి వైకుంఠద్వార దర్శనాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
టికెట్లు, టోకెన్లు ఉన్నవారికే అనుమతి: ఈవో
తిరుమల, జనవరి 7(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 7లక్షల మందికి ఈ నెల 10 నుంచి వైకుంఠద్వార దర్శనాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందస్తు టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠద్వార దర్శనం ఉంటుందని చెప్పారు. టికెట్లు లేనివారు తిరుమల రావచ్చు కానీ దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిర్దేశించిన తేదీ, సమయానికి మాత్రమే భక్తులు క్యూలైన్లలో ప్రవేశించాలని విజ్ఞప్తి చేశారు. ఏకాదశి రోజున వేకువజాము ధనుర్మాస కైంకర్యాలు పూర్తయిన తర్వాత 4.30గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు మొదలవుతాయని, 8 గంటల నుంచి సర్వదర్శన భక్తులను అనుమతిస్తామని వివరించారు. అదేరోజు ఉదయం 9గంటలకు స్వర్ణరథోత్సవం, 12గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు వాహనమండపంలో మలయప్ప స్వామి దర్శనం ఉంటుందని తెలిపారు. మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తామన్నారు.
ఈ 10 రోజుల దర్శనాలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా 1.40 లక్షలు, 19,500 శ్రీవాణి టికెట్లను జారీ చేశామని చెప్పారు. సామాన్య భక్తుల కోసం తిరుపతిలో 8 ప్రాంతాలతో పాటు తిరుమల స్థానికుల కోసం కొండపైన మొత్తం 94 కౌంటర్ల ద్వారా మొత్తం 4.32 లక్షల స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని ఈవో వివరించారు. 10, 11, 12వ తేదీలకు సంబంధించిన 1.20 లక్షల టోకెన్లను 9వ తేదీ ఉదయం 5 గంటలకు, ఆ తర్వాత రోజులకు సంబంధించిన టోకెన్లను ఏరోజుకారోజు విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల ద్వారా జారీ చేస్తామన్నారు. ఈ రోజుల్లో సిఫారసులు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు వంటి ప్రత్యేక దర్శనాలేవీ ఉండబోవని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.