Posani Krishna Murali : నన్ను అరెస్టు చేశారు రాజా...!
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:48 AM
‘నన్ను అరెస్టు చేశారు.. రాజా..!’ సినీనటుడు పోసాని కృష్ణమురళి గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లోకి వెళుతూ బయట ఉన్న జనంతో అన్న మాటలివీ!

స్టేషన్ ముందు జనాన్ని ఉద్దేశించి పోసాని
అన్నమయ్య ఎస్పీ పర్యవేక్షణలో ఏడు గంటలపాటు విచారణ
రైల్వేకోడూరు కోర్టులో హాజరు.. పోసాని తరఫున పొన్నవోలు వాదనలు
రాయచోటి/రైల్వేకోడూరు/ఓబులవారిపల్లె, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ‘నన్ను అరెస్టు చేశారు.. రాజా..!’ సినీనటుడు పోసాని కృష్ణమురళి గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లోకి వెళుతూ బయట ఉన్న జనంతో అన్న మాటలివీ! వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ సహా అనేకమందిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో పోసానిని బుఽధవారం రాత్రి హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన వ్యాఖ్యల ద్వారా చిత్రపరిశ్రమలో విభేదాలు సృష్టించారంటూ ఆయనపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసం ఆయనను హైదరాబాద్ నుంచి ఇక్కడకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో, వైసీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా జనం కూడా పెద్ద ఎత్తున పోలీసుస్టేషన్ వద్ద గుమికూడారు. వారిని ఉద్దేశించి పోసాని పై వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ గురుమహేశ్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారించారు. భుజం నొప్పి, గుండె సంబంధిత సమస్యల కారణంగా మందులు తీసుకుంటున్నట్లు గుర్తించారు. కాగా, పోసానిని బుధవారం అర్ధరాత్రికి కర్నూలులోని బెటాలియన్‌కు తరలించారు.
‘నేను చేసింది తప్పే’
ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పర్యవేక్షణలో పోసానిని ఏడు గంటలపాటు విచారించారు. ఎస్పీ నిర్దేశంలో ఇద్దరు సీఐలు ప్రశ్నలవర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్‌లను ఎందుకు అసభ్యకరంగా తిట్టారు? ఎవరు చెబితే తిట్టారు? ఎవరైనా ముందుగా స్ర్కిప్ట్ రాసి ఇచ్చారా? ఇలా తిట్టడం వెనుక.. ఇంకా ఎవరి హస్తం ఉంది.? వంటి అనేక ప్రశ్నలు పోసానిని అడిగినట్లు సమాచారం. ఇందుకు ఆయన స్పందిస్తూ... ‘నన్ను ఎవరూ ప్రేరేపించలేదు. ఎవరూ నాకు చెప్పలేదు. నేనే స్వయంగా మాట్లాడాను. అలా మాట్లాడటం తప్పే’ అని పోసాని అన్నట్టు తెలిసింది. ఎస్పీ 17 ప్రశ్నలు వేయగా, ఎక్కువగా నాకు తెలియదు.. గుర్తు లేదని తెలిపినట్టు సమాచారం. ఈ సమయంలో అప్పటి వీడియోలు చూపించగా, ‘లవ్ యూ రాజా’ అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. విచారణ అనంతరం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోసానిని రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరచారు. పోసాని తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా, ప్రజలు, జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా నోటికొచ్చినట్లు పోసాని మాట్లాడ డం వల్లే ఆయనపై కేసు పెట్టినట్లు ఫిర్యాదుదారు చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్ మణి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకుల తల్లి, భార్య, బిడ్డల గురించీ ఇష్టమొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడారని అన్నారు.