Share News

Formers : కన్నీటి పంట..!

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:09 AM

అప్పులు తెచ్చి, లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన ఉద్యాన పంటలు అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చాయి. వైర్‌సల దెబ్బకు నిలువునా ఎండిపోతున్నాయి. పంటలను తోటల్లోనే వదిలేస్తున్నారు. పెట్టుబడులు, ఆరుగాలం కష్టం వృథా అవుతున్నాయి. లక్షల రూపాయల నష్టాలు మూటగట్టుకుంటున్నారు రైతులు. వైర్‌సల దెబ్బకు ఉద్యాన పంటలైన కలింగర, కర్బూజా, ఢిల్లీ దోస ...

Formers : కన్నీటి పంట..!

- ఉద్యాన పంటలపై వైరస్‌ పంజా

- దెబ్బతిన్న కలింగర, కర్బూజా,

ఢిల్లీదోస పంటలు

- వేలాది ఎకరాల్లో నష్టం

- తోటల్లోనే వదిలేస్తున్న రైతులు

అప్పులు తెచ్చి, లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన ఉద్యాన పంటలు అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చాయి. వైర్‌సల దెబ్బకు నిలువునా ఎండిపోతున్నాయి. పంటలను తోటల్లోనే వదిలేస్తున్నారు. పెట్టుబడులు, ఆరుగాలం కష్టం వృథా అవుతున్నాయి. లక్షల రూపాయల నష్టాలు మూటగట్టుకుంటున్నారు రైతులు. వైర్‌సల దెబ్బకు ఉద్యాన పంటలైన కలింగర, కర్బూజా, ఢిల్లీ దోస దారుణంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

-ఆంధ్రజ్యోతి, చెన్నేకొత్తపల్లి

విస్తారంగా సాగు

వేరుశనగ సాగు చేసి ఏటా నష్టాలు వస్తుండటంతో ఉద్యాన పంటల వైపు జిల్లా రైతులు మొగ్గు చూపుతున్నారు. కలింగర, కర్బూజా, ఢిల్లీదోస


పంటలను వేల ఎకరాల్లో సాగు చేశారు. చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి, ముదిగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి తదితర మండలాల్లో వందల ఎకరాల్లో పంటలు పెట్టారు.

చుట్టుముట్టిన వైర్‌సలు

పంటలు కీలక దశలో వైర్‌సలు చుట్టుముట్టాయి. రసం పీల్చే పురుగు పంటలను విపరీతంగా ఆశించింది. తెల్లదోమ, తామర పురుగుతోపాటు నల్లి, క్రిప్స్‌ అనే వైరస్‌లు మూడు పంటలపై అధికంగా వ్యాపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. రసం పీల్చే పురుగు పంటను ఆశిస్తోంది. ఆకులు, కాయల్లోని రసాన్ని పీల్చేస్తోంది. దీంతో తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. కాయలు ఎందుకూ పనికి రాకుండాపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. ఏ మందులు వాడాలో సలహాలివ్వాల్సిన ఉద్యాన శాఖాధికారులు తోటల వద్దకు కూడా రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. దీంతో ఎరువుల దుకాణాల వద్దకెళ్లి వారు ఇచ్చిన రసాయన మందులు తీసుకొచ్చి, పంటలకు పిచికారీ చేస్తున్నారు. ఇందుకోసం వేల రూపాయలు వెచ్చిస్తున్నారు. అయినా ఫలితం దక్కట్లేదు. పంటలు ఎండిపోతున్నాయి. ఇలా.. రైతులపై మందులపై అదనపు భారం పడుతోంది.

నివారణ చర్యలు

పంటలకు వైరస్‌ సోకకుండా రైతులు తగిన నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు ఉద్యాన శాఖాధికారులు. రసం పీల్చే పురుగును అరికట్టడానికి జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంట చుట్టూ మూడు, నాలుగు వరుసలు జొన్నగానీ, మొక్కజొన్నగానీ వేసుకోవాలని సూచిస్తున్నారు. పిప్రోనిల్‌, అసిఫేట్‌ తదితర మందులను పిచికారీ చేసుకోవాలని చెబుతున్నారు.

పంట పూర్తిగా దెబ్బతింది

ఐదెకరాల్లో కలింగర సాగుచేశా. రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టా. ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేశా. అయినా వైరస్‌ అదుపులోకి రాలేదు. పంట మొత్తం తుడిచి పెట్టుకుపోయింది.

- ఓబిరెడ్డి, కలింగర రైతు, చెన్నేకొత్తపల్లి

రూ.4లక్షల దాకా నష్టం

ఎనిమిది ఎకరాల్లో దోస సాగుచేశా. రూ.9 లక్షలదాకా పెట్టుబడి వచ్చింది. ఆశించిన మేర దిగుబడి రాలేదు. దీంతో రూ.4 లక్షల వరకు నష్టం వచ్చింది. పంటను కాపాడుకునేందుకు ఎంత కష్టపడినా ఫలితం లేదు.

- నరేశ, దోస రైతు, ముదిగుబ్బ

మూడున్నర ఎకరాల్లో కలింగర సాగుచేశా

మూడున్నర ఎకరాలో కలింగర సాగు చేశా. రూ.3.50లక్షలు పెట్టుబడి వచ్చింది. అప్పు చేసి పంట పెడితే రూ.2.50లక్షలు నష్టం వచ్చింది.

- నాగరాజు, రైతు, కనగానపల్లి

వేసవిలో వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ

వేసవిలో కలింగర, దోస, ఢిల్లీదోస తదితర పంటలకు వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ. అననుకూల సీజన కావడమే ఇందుకు కారణం. అధిక మొతాదులో మందులు వాడినా ప్రయోజనం ఉండదు. పంటలో సస్యరక్షణ పద్ధతులు పాటించాలి.

- చంద్రశేఖర్‌, జిల్లా ఉద్యాన శాఖాధికారి


మ‌రిన్ని అనంత‌పురం వార్త‌ల కోసం...

Updated Date - Mar 20 , 2025 | 12:09 AM

News Hub