Share News

Education Dept : జీవో 117 రద్దు

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:00 AM

విద్యారంగానికి గొడ్డలి పెట్టుగా మారిన జీవో 117కు స్వస్తి పలికేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గత జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వివాదాస్పద జీవోను రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా...

Education Dept : జీవో 117  రద్దు

  • విద్యారంగంలో సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన గత వైసీపీ ప్రభుత్వం

  • జగన్‌ అనాలోచిత నిర్ణయంతో ఊరి బడికి ఉరి

  • జీవోకు స్వస్తి చెప్పడానికి కూటమి ప్రభుత్వ కార్యాచరణ

  • సన్నాహక మార్గదర్శకాలు జారీ.. 2 నెలలు క్షేత్రస్థాయి అధ్యయనం

  • ఫిబ్రవరి చివరినాటికి జీవో రద్దు.. కొత్త జీవో ప్రకారం టీచర్ల బదిలీలు

  • ఇకపై 5 రకాలుగా పాఠశాలలు.. ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దు

  • కొత్తగా మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు.. వాటిలో ప్రతి తరగతికీ ఒక టీచర్‌

  • పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

అమరావతి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): విద్యారంగానికి గొడ్డలి పెట్టుగా మారిన జీవో 117కు స్వస్తి పలికేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గత జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వివాదాస్పద జీవోను రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా, దాన్ని ఉపసంహరించిన తర్వాత ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది. దీనిలో భాగంగా ఆ శాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు గురువారం సన్నాహక మార్గదర్శకాలపై ఉత్తర్వులు విడుదల చేశారు. వీటి ఆధారంగా రాబోయే 2నెలల పాటు క్షేత్రస్థాయిలో మరోసారి అధ్యయనం చేస్తారు. ఫిబ్రవరి చివరి నాటికి ఈ కసరత్తును పూర్తిచేసి జీవో 117 పూర్తిగా రద్దు చేస్తారు. ఆ తర్వాత కొత్తగా జారీచేసే జీవో ఆధారంగా ఏప్రిల్‌లో ఉపాధ్యాయ బదిలీలు ఉంటాయి. విద్యారంగంలో సంస్కరణల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోతో ప్రాథమిక విద్యా నిట్టనిలువునా చీలిపోయింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో తల్లిదండ్రులు ప్రైవేటు బడుల బాట పట్టారు. నాటి సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయం ఊరి బడికి ఉరిగా మారింది. ఈ జీవోతో ప్రాథమిక విద్యావ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని ఉపాధ్యాయులు, మేధావులు ఆందోళన చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఈ జీవోకు స్వస్తి పలికేందుకు ప్రక్రియను ప్రారంభించింది.


ఐదు రకాల పాఠశాలలు

కొత్త విధానంలో ఐదు రకాల పాఠశాలలను ప్రతిపాదించారు. శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్‌లో ప్రీప్రైమరీ 1, 2 తరగతులు ఉంటాయి. వీటిని మహిళా, శిశు సంక్షేమ శాఖ నడుపుతుంది. ఫౌండేషనల్‌ స్కూల్‌లో ప్రీప్రైమరీ 1, 2, 1-2 తరగతులుంటాయి. బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌లో ప్రీప్రైమరీ 1, 2, 1- 5 తరగతులు ఉంటాయి. మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లోనూ ప్రీప్రైమరీ 1, 2, 1-5 తరగతులుంటాయి. వీటిలో ప్రతి తరగతికి ఒక్కో టీచర్‌ చొప్పున ఉంటారు. ఉన్నత పాఠశాల్లో 6-10 తరగతులుంటాయి. ఇక ప్రాథమిక పాఠశాలల్లో వేటిని మోడల్‌ ప్రైమరీ స్కూళ్లుగా మార్చాలో గుర్తించేందుకు మండల స్థాయి, క్లస్టర్‌ స్థాయిలో కమిటీలను నియమించారు. ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీ వార్డుల్లో ఈ స్కూళ్లను ఏర్పాటుచేస్తారు. గత ప్రభుత్వంలో ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు వెనక్కి తీసుకొస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6-8 తరగతుల విద్యార్థుల సంఖ్య 30, అంతకంటే తక్కువగా ఉంటే అక్కడి తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి, దాన్ని ప్రాథమిక పాఠశాలగా మారుస్తారు. ఈ తరగతుల్లో విద్యార్థుల సంఖ్య 60, అంతకంటే ఎక్కువ ఉంటే ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30 నుంచి 60 మధ్యలో ఉంటే బడిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ప్రాథమికోన్నత పాఠశాలకు 3కి.మీ. పరిధిలో ఉన్నత పాఠశాల లేకపోతే అక్కడ దాన్ని కొనసాగిస్తారు. లేదంటే విద్యార్థులకు రవాణా చార్జీలు ఇస్తారు.


టీచర్ల కేటాయింపు ఇలా...

  • కొత్త పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల కేటాయింపులోనూ మార్పులు చేయనున్నారు.

  • ఫౌండేషనల్‌ స్కూల్‌లో 1-30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ను, 31- 60 మంది వరకు రెండో ఎస్జీటీని కేటాయిస్తారు.

  • బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌లో 1- 20 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని, 21- 60 మందికి ఇద్దరు ఎస్జీటీలను కేటాయిస్తారు.

  • మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 60కి చేరితే ప్రతి తరగతికి ఒక టీచర్‌ను ఇస్తా రు. విద్యార్థుల సంఖ్య 120 దాటితే హెచ్‌ఎం పోస్టు, 150 దాటితే ప్రతి అదనపు 30 మంది విద్యార్థులకు మరో ఎస్జీటీని కేటాయిస్తారు.

  • ఉన్నత పాఠశాలల్లో సెక్షన్ల వారీగా టీచర్లను కేటాయిస్తారు. కనీసం 5 సెక్షన్లు ఉంటే ఒక హెచ్‌ఎం, ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ను ఇస్తా రు. గరిష్ఠంగా 31 సెక్షన్లు ఉంటే హెచ్‌ఎంతో పాటు మొత్తం 31 మంది టీచర్లుంటారు.

  • ఉన్నత పాఠశాలల్లో 76, అంతకంటే ఎక్కువమంది విద్యార్థులుంటే హెచ్‌ఎం, పీఈటీ పోస్టులు ఇస్తారు. అదే విద్యార్థుల సంఖ్య 75, అంతకంటే తక్కువగా ఉంటే ఆ పాఠశాలలో సీనియర్‌ టీచర్‌ హెచ్‌ఎంగా వ్యవహరిస్తారు. జిల్లాలో అదనంగా పీఈటీలు ఉంటే కేటాయిస్తారు.

  • ఉన్నత పాఠశాలల్లో 400 మంది విద్యార్థులు దాటితే రెండో పీఈటీ, 751 దాటితే మూడో పీఈటీ పోస్టు ఇస్తారు.

  • విద్యార్థుల సంఖ్య ఆధారంగా మ్యూజిక్‌, ఆర్ట్స్‌ అండ్‌ డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌ల్లో ఎవరైనా ఒక టీచర్‌ను ఉన్నత పాఠశాలలకు కేటాయిస్తారు.

Updated Date - Jan 10 , 2025 | 04:01 AM