Share News

Ayyanna Patrudu: మార్చి 21 వరకు అసెంబ్లీ

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:21 AM

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చి 21 వరకు నిర్వహించాలని సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది.

Ayyanna Patrudu: మార్చి 21 వరకు అసెంబ్లీ

  • మొత్తం 15 పనిదినాల్లో సమావేశాలు

  • బీఏసీలో నిర్ణయం భేటీకి జగన్‌ గైర్హాజరు

  • నేడు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ

  • సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సమాధానం

  • రేపు, ఎల్లుండి సెలవులు.. 28న రాష్ట్ర బడ్జెట్‌

  • 3 నుంచి కేటాయింపులపై చర్చ

  • ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల పునరుద్ధరణ

  • స్పీకర్‌ అధ్యక్షతన బీఏసీలో నిర్ణయం.. భేటీకి జగన్‌ గైర్హాజరు

  • వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం

  • ప్రతిపక్ష హోదా డిమాండ్‌పై సీఎం వ్యాఖ్య

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చి 21 వరకు నిర్వహించాలని సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. సోమవారం ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించిన తర్వాత.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్‌, బీజేపీ తరఫున విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. వైసీపీ నుంచి మాజీ సీఎం జగన్‌ హాజరు కావలసి ఉన్నా ఆయన రాలేదు. అసెంబ్లీ సమావేశాలను మొత్తం 15 పనిదినాలు నిర్వహించాలని బీఏసీ భేటీలో ఖరారుచేశారు. మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం సమాధానం ఇస్తారు. మహాశివరాత్రి సందర్భంగా 26న సెలవు. ఎమ్మెల్సీ పోలింగ్‌ సందర్భంగా 27న కూడా సభ ఉండదు. 28వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెడతారు. మార్చి 1, 2 శని, ఆదివారాలు కావడంతో సెలవులు ఇచ్చారు. 3 నుంచి బడ్జెట్‌ కేటాయింపులపై సాధారణ చర్చ జరుగుతుంది. 19వ తేదీతో బడ్జెట్‌ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 20, 21లను రిజర్వ్‌డేలుగా ఉంచారు. కాగా.. బీఏసీలో పలు అంశాలపై చర్చించారు.


సభ్యులందరూ వారికి కేటాయించిన అంశాలపై సమగ్ర అవగాహనతో మాట్లాడేలా చూడాలని, సభ్యులందరికీ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలని సీఎం సూచించారు. అసెంబ్లీ నూతన భవన నిర్మాణంపైనా చర్చించారు. ఈ భవనాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని, ఇతర రాష్ట్రాల్లో కొత్తగా కట్టిన అసెంబ్లీ భవనాలను పరిశీలించాలని నిర్ణయించారు. దీనికోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రజాప్రతినిధులకు నిర్వహించతలపెట్టిన శిక్షణ తరగతులను ఈ సమావేశాల్లో నిర్వహించే అవకాశం లేదని బీఏసీ అభిప్రాయపడింది. గతంలో ఉభయసభల సభ్యులకు సాంస్కృతిక కార్యక్రమాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది.

వ్యక్తిగత డిమాండ్లకు నో

జగన్‌ ప్రతిపక్ష హోదా డిమాండ్‌పై కూడా చర్చ జరిగింది. రాజ్యాంగబద్ధంగా సభ్యులు ఏమడిగినా ఇవ్వడానికి, చెప్పడానికి అభ్యంతరం లేదని, కానీ వ్యవస్థను కాదని వ్యక్తిగత డిమాండ్లను తెస్తే పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదని సమావేశం అభిప్రాయపడింది. వ్యక్తుల కన్నా వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది తన అభిమతమని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 25 , 2025 | 04:21 AM