Share News

Deputy CM Pawan Kalyan : వైసీపీ మాదిరి హీరోలను రప్పించం!

ABN , Publish Date - Jan 05 , 2025 | 03:34 AM

సినిమా టికెట్ల ధరల పెంపుతో కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Deputy CM Pawan Kalyan : వైసీపీ మాదిరి హీరోలను రప్పించం!
Deputy CM Pawan Kalyan

  • వారితో నమస్కారాలు పెట్టించుకోం

  • సినీ పరిశ్రమంటే చంద్రబాబుకు గౌరవం

  • ‘బ్లాక్‌’ నిరోధానికే టికెట్ల ధరల పెంపు

  • నిర్మాతలకే కాదు.. వీటితో ప్రభుత్వానికీ

  • 18 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం

  • ‘మెగా’ కుటుంబానికి అహంకారం లేదు

  • డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలు

  • రాజమహేంద్రిలో ‘గేమ్‌ చేంజర్‌’ ఈవెంట్‌

రాజమహేంద్రవరం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): సినిమా టికెట్ల ధరల పెంపుతో కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ప్రతి టికెట్‌పై ప్రభుత్వానికి 18శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరుతుందన్నారు. టికెట్ల ధర పెంపు డిమాండ్‌, సప్లయ్‌ ఆధారంగా జరుగుతుందని తెలిపారు. బ్లాక్‌ టికెట్ల విక్రయాలను నిరోధించేందుకు కూడా ఇది దోహద పడుతుందన్నారు. గత ప్రభుత్వంలో తన సినిమా ‘భీమ్లా నాయక్‌’కు టికెట్లు పెంచకపోగా తగ్గించేశారని తెలిపారు. సినిమా హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలని తాము కోరుకోబోమని, గతంలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయాలనుకోలేదన్నారు. కానీ, గత ప్రభుత్వం(వైసీపీ) మాత్రం తాను అభిమానించే చిరంజీవితోపాటు ప్రభాస్‌, మహేశ్‌బాబు వంటి హీరోలను రప్పించుకుందని అన్నారు. తాము మాత్రం అలా కోరుకోలేదని చెప్పారు. ‘‘ఎక్కువమంది హీరోలు కూటమికి సపోర్టు చేయలేదు. అయినా మేం సినిమా పరిశ్రమకు రాజకీయ రంగు పులమం. మేం నిర్మాతలతో మాట్లాడతాం. వారిని గుర్తిస్తాం. టికెట్‌ ధరల పెంపు కోసం హీరోలు రావక్కర్లేదు. మేం అల్పస్థాయి వ్యక్తులం కాదు’’ అని పరోక్షంగా వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలతో వ్యవహరించిన తీరును డిప్యూటీ సీఎం తప్పుబట్టారు. తమకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉందన్నారు. చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ఉన్నారని, ఆయన ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమకు దోహదపడ్డారు తప్ప ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.


చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం కూడా తమకు ఇష్టం లేదన్నారు. టికెట్ల పెంపు అంశంపై ప్రతిసారీ తప్పడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి జాతీయ రహదారి పక్కన శనివారం నటుడు రామ్‌చరణ్‌ నటించిన ‘గేమ్‌ చేంజర్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హాజరయ్యారు. అదేవిధంగా గ్లోబల్‌ స్టార్‌, సినీ హీరో రామ్‌చరణ్‌, ప్రముఖ దర్శకుడు శంకర్‌, సంగీత దర్శకుడు తమన్‌, నటులు ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌ తదితర చిత్ర తారాగణం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు.

రాజకీయాలు చేయొద్దు..

‘‘సినిమాలు తీసేవాళ్లే మాత్రమే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి. సినిమాలు తీయని వాళ్లు మాట్లాడొద్దు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్లు మాకు నచ్చరు. ఈ మాట నేను ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం తరఫున చెబుతున్నా. ఎన్టీఆర్‌ పాటించిన ఔన్నత్యాన్ని మేం పాటిస్తున్నాం’’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సినిమాలను సామాజిక బాధ్యతతో తీయాలని సూచించారు. సినిమాలు తీసి, దాని సాధకబాధకాలు తెలిసిన వారితోనే తాము మాట్లాడతామని స్పష్టం చేశారు. సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారంపై హీరోలు కాకుండా నిర్మాతలు ముందుకు రావాలని సూచించారు. దర్శకుడు శంకర్‌ సామాజిక బాధ్యతతో సినిమాలు తీస్తారని పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ‘‘ఆయన తీసిన సినిమా ‘జంటిల్‌మెన్‌’కు నేను కూడా బ్లాక్‌లో టికెట్‌ కొనుక్కొని వెళ్లా. అదో సరదా. ఇలానే చాలామంది అభిమానులు తమకు ఇష్టమైన హీరో సినిమాలకు వెళ్తారు. వారి డబ్బులు ‘బ్లాక్‌’లోకి వెళ్లకుండా నిర్మాతలకు, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం రూపంలో వస్తేనే మంచిది’’ అని వ్యాఖ్యానించారు.


ఈ సంస్కృతి సరికాదు..

చిత్ర పరిశ్రమ అంతా గతంలో ఒకేలా ఉండేదని, 1990ల నుంచి టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ సంస్కృతి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘‘ఈ వుడ్‌ కల్చర్‌ వద్దు. అంతా భారతీయ సినిమాగా ఉండాలి. మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా విశ్వానికి చూపించాలి. నేనైనా, రామ్‌చరణ్‌ అయినా చిరంజీవి ఇచ్చిన ఊతంతోనే నిలబడగలిగాం. తండ్రి మెగాస్టార్‌ అయితే కొడుకు గ్లోబల్‌స్టార్‌ అయ్యాడు. ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ‘మెగా’ కుటుంబంలో ఎవరికీ అహంకారం లేదని, ఎవరి పట్లా వివక్ష చూపదని అన్నారు. ‘‘వేరే హీరోలను ద్వేషించే కుటుంబం కాదు మాది. ఒక హీరో సినిమా పోవాలని కూడా కోరుకోం. అందరూ బాగుండాలనే ఆలోచనను మా నాన్న నేర్పారు. సర్వేజనా సుఖినోభవంతు అని చెప్పారు’’ అన్నారు. ‘‘మహానుభావుడు ఎన్టీఆర్‌ నుంచి ఎన్నో నేర్చుకోవాలి. కోట శ్రీనివాస్‌ వంటి నటులు ఎన్ని విమర్శలు చేసినా, షూటింగ్‌లో కలిసినప్పుడు మాత్రం.. ‘ఏం బ్రదర్‌ ఎలా ఉన్నార’ని ఎన్టీఆర్‌ కుశల ప్రశ్నలు వేసేవారు. కృష్ణ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా, ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకునేవారు. అలా చిత్రపరిశ్రమ ఔనత్యాన్ని పెంచాలి’’ అని పవన్‌ హితవు పలికారు.


ఉపాధి చూపండి..

రాష్ట్రంలో ఉన్న ప్రకృతి అందాలను, మంచి ప్రాంతాల(లోకేషన్లు)ను సినిమాల్లో చూపించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. ‘‘గోదావరి జిల్లాలు, రాయలసీమ వంటి ప్రాంతాల్లో స్టంట్‌ స్కూళ్లు పెట్టాలి. స్టూడియోలు పెట్టాలి. స్ర్కీన్‌ప్లే ఎలా రాయాలో నేర్పాలి. అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డైరెక్టర్లు ఎలా కావాలో నేర్పాలి. డిజనైనింగ్‌, ఫిల్మ్‌మేకింగ్‌ స్కూళ్లూ పెట్టాలి. ఈ ప్రాంత యువతకు ఉఽపాధి కల్పించాలి’’ అని సూచించారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నం చేయాలని నిర్మాత దిల్‌ రాజును కోరారు.

‘‘అడగ్గానే టికెట్ల ధరలు ఎందుకు పెంచారని, ఎందుకు పెంచాలని కొందరు అడుగుతుంటారు. సినిమాకు ‘డిమాండ్‌-సప్లయ్‌’ సూత్రం వర్తిస్తుంది. సినిమా విడుదలైన మొదటి రోజే చూడాలనుకోవడం డిమాండ్‌. ఇవాళ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దానికి తగ్గట్లు సినిమాలు ఉండాలి. సినిమాలు అలా తీయాలంటే డబ్బు కావాలి. అందుకే టికెట్ల ధరలు పెంచాలని కోరతారు’’

- డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Updated Date - Jan 05 , 2025 | 07:11 AM