AP Govt : ఇంటర్ పరీక్షల్లో సంస్కరణలు
ABN , Publish Date - Jan 08 , 2025 | 03:15 AM
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు ప్రారంభించింది.
ఫస్టియర్‌కు పబ్లిక్ పరీక్షలు అవసరమా?
నేటినుంచి ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధం
ఇకపై ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ తరగతులు
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు ప్రారంభించింది. సీబీఎ్‌సఈలో 11వ తరగతికి పబ్లిక్ పరీక్షలు లేవు. 12వ తరగతిలో మాత్రమే ఉంటాయి. జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కూడా 12వ తరగతి మార్కులనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో ఇంటర్ రెండో సంవత్సరంలో పబ్లిక్ పరీక్షలుంటే చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనిపై ఏకపక్షంగా కాకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది నిర్ణయం ప్రకటించనుంది. బుధవారం (నేడు) నుంచి ఈ నెల 26వరకు దీనిపై అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఒక్కసారే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు చదువుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని, ఒత్తిడి తగ్గి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే వచ్చే ఏడాది నుంచి సిలబ్‌సలో భారీగా మార్పులు తెచ్చి, పాఠ్యాంశాలను తగ్గించనుంది. అదేవిధంగా విద్యా సంవత్సరంలోనూ కీలక మార్పులు తేవాలని ఇంటర్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జూన్ 1 నుంచి మార్చితో విద్యా సంవత్సరం ముగుస్తోంది. ఏప్రిల్, మే నెలలు కాలేజీలకు సెలవులు ఇస్తున్నారు. ఇకపై వేసవి సెలవులను విద్యా సంవత్సరం మధ్యలోకి తేవాలని బోర్డు భావిస్తోంది. అంటే మార్చితో విద్యా సంవత్సరం ముగిస్తే, ఆ వెంటనే ఏప్రిల్ 1 నుంచి తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌లో 1 నుంచి 24 వరకు తరగతులు నిర్వహిస్తారు. ఆ తర్వాత వేసవి సెలవులు ఇచ్చి, తిరిగి జూన్ 1న కాలేజీలు తెరుస్తారు. వేసవి సెలవులకు ముందు పూర్తిచేసిన సిలబస్ నుంచి బోధన కొనసాగిస్తారు.