Share News

Poultry Farm : ఎన్టీఆర్‌ జిల్లాలో బర్డ్‌ఫ్లూ!

ABN , Publish Date - Feb 18 , 2025 | 03:58 AM

బర్డ్‌ఫ్లూ లక్షణాలతో 3 వేల కోళ్లు మృత్యువాతపడటం కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Poultry Farm : ఎన్టీఆర్‌ జిల్లాలో బర్డ్‌ఫ్లూ!

  • ఎ.కొండూరులో 3 వేల కోళ్లు మృత్యువాత

  • నమూనాలు ల్యాబ్‌కు పంపిన అధికారులు

  • పశ్చిమగోదావరిలో కొనసాగుతున్న కోళ్ల ఖననం

ఎ.కొండూరు, తాడేపల్లిగూడెం రూరల్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలంలో బర్డ్‌ఫ్లూ లక్షణాలతో 3 వేల కోళ్లు మృత్యువాతపడటం కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కృష్ణారావుపాలెం గ్రామ శివారు దీప్లానగర్‌ తండాలోని ఓ ఫామ్‌లో 3 వేల కోళ్లు మృతిచెందాయి. పశుసంవర్థక శాఖ అధికారులు సోమవారం ఆ పౌల్ర్టీ ఫామ్‌ను పరిశీలించారు. చనిపోయిన కోళ్లను పాతిపెట్టించారు. బతికున్న కోళ్ల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపించారు.

పెదతాడేపల్లిలో 21 వేల కోళ్ల ఖననం

కాగా, బర్డ్‌ఫ్లూ వెలుగుచూసిన పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారులు చర్యలు చేపట్టారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి గ్రామంలోని ఒక పౌల్ర్టీ ఫామ్‌లో 21 వేల కోళ్లను సోమవారం ఖననం చేయించారు. పౌల్ర్టీ సమీపంలో పెద్ద గొయ్యి తీయించి అనుమానిత కోళ్లను అందులో వేసి పాతిపెట్టారు. గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి చేయించారు.

Updated Date - Feb 18 , 2025 | 03:58 AM