CM Chandrababu Naidu : స్వర్ణాంధ్ర చేసి చూపిస్తా
ABN , Publish Date - Jan 04 , 2025 | 03:22 AM
‘‘నాపై విశ్వాసం ఉంచండి. స్వర్ణాంధ్ర ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. ఎప్పు డూ వాస్తవాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి. దీనికితోడు ఆధ్మాత్మికత ఎంతో అవసరం’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సంపద సృష్టిలో ఏపీని ముందుకు తీసుకెళతా
గణపతి సచ్చిదానందను దర్శించుకున్న సీఎం
విజయవాడ ఆశ్రమంలో చంద్రబాబు పూజలు
చంద్రబాబు మంచికర్మయోగి: సచ్చిదానంద
విజయవాడ, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ‘‘నాపై విశ్వాసం ఉంచండి. స్వర్ణాంధ్ర ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. ఎప్పు డూ వాస్తవాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలి. దీనికితోడు ఆధ్మాత్మికత ఎంతో అవసరం’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయవాడ పటమటలో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశా రు. సచ్చిదానంద స్వామితో ఏకాంతంగా భేటీ అయ్యారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. దీనికిముందు స్వామిజీ చేపట్టే 53 దత్త క్షేత్రాల పర్యటనకు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పరివార నివాస సముదాయ భవన శిలాఫలకం ఆవిష్కరించారు. ‘‘సచ్చిదానంద స్వామిజీ సమాజం కోసం పనిచేస్తారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు యజ్ఞం చేశారు. స్వామిజీ తన భక్తుల కోసం దత్తక్షేత్రాలు ఏర్పాటు చేశారు. ఆయన వద్దకు వెళ్లినప్పుడు అక్క డే ఉండిపోవాలనిపిస్తుంది. అంతటి మనశ్శాంతి లభిస్తుం ది’’ అని చంద్రబాబు అన్నారు. స్వామిజీ ఇక్కడ ఉన్నంత వరకు అంతా శుభం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘ఆయనపై ఉన్న నమ్మకంలో కొంత నాపై చూపితే స్వర్ణాంధ్రను అందజేస్తాను’’ అని తెలిపారు. ‘‘విజన్ 2020ని చాలా మంది తప్పుబట్టారు. కానీ, దాని ఫలితాలను ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు విజన్ 2047 రూపొందించాను. సంపద సృష్టిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను’’ అని ఆయన తెలిపారు.
రాజ్యమేది అంటే అమరావతి: సచ్చిదానంద
చంద్రబాబు మంచి కర్మయోగి అని గణపతి సచ్చిదానం ద స్వామి కొనియాడారు. కనకదుర్గమ్మ, పరమాత్ముడి సహకారంతో చంద్రబాబు అనుకున్న కార్యక్రమాలు సిద్ధించాలని ప్రార్థించారు. స్వర్ణాంధ్ర సంకల్పానికి భగవంతుడు శక్తి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని గీత మాత, మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రార్థించారు. చంద్రబాబును తన కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నానన్నారు. ‘‘అన్ని పనులు తక్షణమే జరగవు. రాముడు రాజ్యానికి వచ్చిన తర్వాత అభివృద్ధికి ఐదేళ్లు పట్టింది. చెడును గెలవడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. పదేళ్ల క్రితం ప్రారంభమైన అమరావతి మళ్లీ మనకు వచ్చేసింది’’ అని అన్నారు. అమెరికాలో మన రాజ్యమేది అని అడిగినప్పుడు విజయవాడ అని చెప్పాను.. ఇప్పుడు అమరావతి అని చెప్తానన్నారు. ‘‘నాలుగేళ్లుగా దత్త క్షేత్ర యాత్ర చేయలేదు. చంద్రబాబు రావడంతో మళ్లీ ఆ పర్యటన ప్రారంభించాను’’ అని స్వామిజీ అన్నారు.