Share News

CM Chandrababu : మేటి నగరంగా విశాఖపట్నం

ABN , Publish Date - Jan 05 , 2025 | 03:21 AM

దేశానికి ముంబై ఎలా ఆర్థిక రాజధానిగా ఉందో.. ఏపీకి విశాఖపట్నం అలా ఆర్థిక రాజధానిగా, మేటి నగరంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu : మేటి నగరంగా విశాఖపట్నం
Visakhapatnam Navy Show

  • నేవీ విన్యాసాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు

  • మనవడితో కలిసి హాజరు

  • హైకోర్టు సీజే ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ కూడా..

  • ఆకట్టుకున్న తూర్పు నౌకాదళ విన్యాసాలు

విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): దేశానికి ముంబై ఎలా ఆర్థిక రాజధానిగా ఉందో.. ఏపీకి విశాఖపట్నం అలా ఆర్థిక రాజధానిగా, మేటి నగరంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖను మారిటైమ్‌ గేట్‌వేగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నాలెడ్జ్‌ హబ్‌గా పేరు తీసుకువస్తామన్నారు. శనివారం విశాఖ సాగరతీరంలో నిర్వహించిన నేవీ విన్యాసాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు, భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌ ఆఖరి వరకూ ఉండి తిలకించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖపట్నం ఎప్పుడూ వస్తుంటానని, కానీ నేవీ ప్రదర్శన వీక్షించడం ఇదే మొదటిసారన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఆ దేశానికి చెందిన సబ్‌మెరైన్‌ ఘాజీ విశాఖపట్నం నగరాన్ని నాశనం చేయడానికి వస్తున్నప్పుడు.. దాన్ని ఇక్కడికి సమీపంలో తూర్పు నౌకాదళమే మట్టుబెట్టిందని గుర్తు చేశారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు తాను పది రోజులు ఇక్కడే ఉండి అన్నీ సరిచేశానని, ఆ సమయంలో నేవీ అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ఈ నెల 8న ప్రధాని విశాఖలో రైల్వే జోన్‌ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. త్వరలో విశాఖకు మెట్రో రైలు కూడా వస్తుందన్నారు. గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా ఈ ఏడాదే అనకాపల్లి జిల్లాకు తీసుకువస్తామని, వచ్చే ఏడాది విశాఖపట్నం తెస్తామని ప్రకటించారు. తూర్పు నౌకాదళం చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెంధార్కర్‌ మాట్లాడుతూ, విశాఖ ప్రజలు నేవీ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారని, వారి కోసమే ఈ విన్యాసాలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నేవీకి ఎంతో సహకరిస్తోందని చెప్పారు.

Untitled-3 copy.jpg


అద్భుతం.. అబ్బురం

విశాఖ సాగర తీరాన తూర్పు నౌకాదళం ప్రదర్శించిన సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి. ఆద్యంతం అద్భుతంగా సాగిన ప్రదర్శనలు చూపరుల కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశాయి. మెరైన్‌ కమెండోలు ఆకాశం నుంచి ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి పారాచ్యూట్‌ సాయంతో దిగడం, తీరంలో యుద్ధట్యాంకులు మోహరించడం తదితర విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వాస్తవానికి నేవీ డే సందర్భంగా డిసెంబరు 4న ఈ విన్యాసాల ప్రదర్శన పూరీ తీరంలో రాష్ట్రపతి ఎదుట నిర్వహించారు. విశాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా మరోసారి శనివారం సాయంత్రం ఇక్కడి ఆర్‌కే బీచ్‌లో ప్రదర్శించారు. విన్యాసాల్లో భాగంగా మెరైన్‌ కమెండోలు ఆకాశం నుంచి ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి పారాచ్యూట్‌ సాయంతో వేదిక దగ్గర దిగి సీఎం చంద్రబాబునాయుడుకు జ్ఞాపికను బహూకరించడం విశేషంగా ఆకట్టుకుంది. అలాగే, యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌పై నుంచి ప్రదర్శించిన లేజర్‌ షో, డ్రోన్లతో ప్రదర్శించిన వివిధ చారిత్రక చిహ్నాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఽదీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Untitled-3 copy.jpg

Updated Date - Jan 05 , 2025 | 07:07 AM