Solar Great Wall : ‘సౌర’ భారం!
ABN , Publish Date - Jan 12 , 2025 | 04:32 AM
మృత్యుసముద్రంగా పేరొందిన కబుకీ ఎడారిలో.. 400 కిలోమీటర్ల పొడుగున.. 5 కిలోమీటర్ల వెడల్పున ‘సోలార్ గ్రేట్‌వాల్’ను నిర్మిస్తోంది చైనా!
వాటిలోని కాడ్మియం, టెల్యూరియం వంటివి భూమిలోకి
వాటివల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికీ ప్రమాదం
భారత్‌లో 2023కే పోగుపడ్డ లక్ష టన్నుల సోలార్ వేస్ట్
రానున్న దశాబ్దాల్లో మరింత భారీగా పెరిగిపోయే ముప్పు
ముందు జాగ్రత్త పడకపోతే ప్రమాదం: నిపుణుల హెచ్చరిక
సౌరఫలకాల రీసైక్లింగ్ దిశగా ఈయూ పటిష్ఠ నిబంధనలు
మన ప్రభుత్వాలు కూడా జాగ్రత్తపడాలని నిపుణుల సూచన
దేశంలో పెరుగుతున్న సౌరవిద్యుత్ వినియోగంతో పేరుకుపోతున్న సోలార్ సెల్స్, మాడ్యూళ్ల వ్యర్థాలు
మృత్యుసముద్రంగా పేరొందిన కబుకీ ఎడారిలో.. 400 కిలోమీటర్ల పొడుగున.. 5 కిలోమీటర్ల వెడల్పున ‘సోలార్ గ్రేట్‌వాల్’ను నిర్మిస్తోంది చైనా! దాని ద్వారా 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది డ్రాగన్ దేశం లక్ష్యం. మన తెలుగు రాష్ట్రాలు కూడా.. సౌర విద్యుత్తుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి!! సౌర విద్యుత్తు పర్యావరణ హితం అని భావించడమే ఇందుకు కారణం. ఆ మాట కొంతవరకూ నిజమేగానీ, కాలం చెల్లిన సౌర ఫలకాల వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సౌర విద్యుత్తు అనగానే మనకు గుర్తొచ్చేది.. ఇంటి పైభాగంలో అమర్చే ఆ నల్లటి సౌరఫలకాలే (ఫోటోవోల్టాయిక్ సెల్స్). అన్ని వస్తువుల్లాగానే వాటికి కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. అమర్చిన 20-25 ఏళ్లకు వాటికి కాలం చెల్లిపోతుంది. అలా 2030 నాటికి మనదేశంలో 3.4 లక్షల టన్నుల సౌర వ్యర్థాలు పోగుపడతాయని.. 2050 నాటికి అవి 1.9 కోట్ల టన్నులకు చేరుతాయని ‘ద కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ)’ గత ఏడాది హెచ్చరించింది. ప్రస్తుతానికి మనదేశంలో కాలం చెల్లిన సోలార్‌ప్యానెళ్లను మామూలు తుక్కు కింద మాత్రమే అమ్ముతున్నారు. వాటిని కొనేవారు కూడా.. ఆప్యానెళ్లలోని అల్యూమినియం, రాగి, గ్లాస్ భాగాలను మాత్రమే తీసుకుని.. సిలికాన్, కాడ్మియం టెల్యురైడ్ వంటి వాటిని, పాలిమర్లను పారేస్తున్నారు. అవి భూగర్భంలోకి.. అక్కణ్నుంచీ భూగర్భ జలవనరుల్లోకి చేరి ప్రమాదకరంగా మారుతున్నాయి.
వచ్చే దశాబ్దానికి ఆ వ్యర్థాలు ఇప్పటితో పోలిస్తే నాలుగైదు రెట్లు పెరుగుతాయని అంచనా. కాబట్టి పటిష్ఠ నిబంధనలు రూపొందించి ఇప్పటి నుంచే జాగ్రత్తపడాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ప్రపంచ విద్యుత్తు వినియోగంలో కేవలం 3 శాతంగా ఉన్న సౌర విద్యుత్తు ప్రపంచంలోని టెల్యూరియం నిల్వల్లో 3 శాతాన్ని, వెండిలో 15ు, ఇంకా.. ఇండియమ్, జింక్, టిన్, గాలియం, సెమీకండక్టర్ గ్రేడ్ క్వార్ట్జ్‌ను గణనీయంగా వినియోగించుకుంటున్నట్టు అంచనా.
లక్ష టన్నులు!
సౌర విద్యుత్‌కు సంబంధించి.. 2023 నాటికి భారతదేశ స్థాపిత సామర్థ్యం 66.7 గిగావాట్లు. ప్రస్తుతం దాదాపు 75 గిగావాట్లు. 2070 నాటికి 5,600 గిగావాట్లకు చేరుతుందని.. 2070కల్లా భారతదేశం సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తుందని సీడబ్ల్యూఈఈ గత ఏడాది ఒక నివేదికలో వెల్లడించింది. దీనికి అనుగుణంగానే సౌరఫలకల వ్యర్థాల పెరుగుదల కూడా ఉంటుందని పేర్కొంది. సీడబ్ల్యూఈఈ నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరం నాటికే మనదేశంలో పోగుపడ్డ సౌర వ్యర్థాలు లక్ష టన్నులు. కానీ, మనదేశంలో.. సౌర వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పు శాఖ ‘ఈ-వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2022’లో సోలార్ సెల్స్, మాడ్యుల్స్‌ను కూడా చేర్చింది తప్ప.. వాటి రీసైక్లింగ్‌కి నిబంధనలు రూపొందించలేదు.
యూపీ రైతు పిటిషన్..
‘కుసుమ్ యోజన’ కింద తమ గ్రామంలో పంటపొలాలకు నీళ్లు అందించేందుకు వినియోగిస్తున్న సౌర విద్యుత్ ఫలకాలు పాడైపోతే, వాటిని పంటపొలాల్లో పాతిపెడుతున్నారని, వాటివల్ల భూసారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. యూపీకి చెందిన ఆశిష్ సింగ్ చండేల్ అనే రైతు జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలోని విషయ తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘సోలార్ వేస్ట్’పై వైఖరి తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈయూ ముందంజ..
సౌర విద్యుత్తు వ్యర్థాల నిర్వహణకు సంబంధించి యూరోపియన్ యూనియన్(ఈయూ) చాలా ముందంజలో ఉంది. ‘‘ద వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్ ఎక్వి్‌పమెంట్ డైరెక్టివ్(డబ్ల్యూఈఈఈ)’’ పేరుతో రూపొందించిన మార్గదర్శకాల్లో.. సౌర వ్యర్థాల నిర్వహణ బాధ్యతను యూరోపియన్ యూనియన్ ఉత్పత్తిదారులు, పంపిణీదారులపైనే పెట్టింది. సౌరఫలకాల జీవితకాలం ముగిసే సమయంలో.. వాటిని తిరిగి సేకరించి, సోలార్ మాడ్యూళ్లను పద్ధతిప్రకారం రీసైక్లింగ్ చేసే బాధ్యత వారిదే. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి.
- సెంట్రల్ డెస్క్
పర్యావరణం.. ఆరోగ్యం.. గుల్ల!
భూగర్భంలోకి, జలవనరుల్లోకి చేరే కాడ్మియం, టెల్యురైడ్ కారణంగా.. పర్యావరణానికి మేలు చేసే ఎన్నోరకాల సూక్ష్మజీవులు చనిపోతాయి. ఫలితంగా పంటల దిగుబడి తగ్గిపోతుంది. ఆ అవశేషాలు మనం తాగే నీటి ద్వారా, పండించే తిండిగింజల రూపంలో మన శరీరంలోకి చేరితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. కాడ్మియం అవశేషాలు ఒంట్లోకి చేరితే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్వాసకోశ వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. అంతేకాదు.. కాడ్మియం క్యాన్సర్ కారకం కూడా.
తిరిగి వాడుకోవచ్చు..
అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధనాల సంస్థ (ఐఆర్‌ఈఏ) అంచనాల ప్రకారం.. కాలం చెల్లిన సౌరఫలకాల నుంచి సేకరించే ముడిపదార్థాల విలువ 2030 నాటికి 450 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.3,860 కోట్లు) ఉండనుంది. అలా సేకరించిన ముడిపదార్థాలతో కొత్తగా 6 కోట్ల సౌరఫలకాలను తయారుచేసి వాటితో 18 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని అంచనా. అలాగే.. 2050 నాటికి అలా సేకరించే ముడిపదార్థాల విలువ 15 బిలియన్ డాలర్లని (దాదాపు రూ.1.28 లక్షల కోట్లు).. వాటితో 200 కోట్ల సోలార్‌ప్యానెళ్లు నిర్మించి 630 గిగావాట్ల విద్యుదుత్పత్తి చేయొచ్చని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.